
ఒకేసారి రెండు రికార్డులు
తొమ్మిదేళ్ల చిన్నారి ప్రతిభ
ఆర్మూర్: తొమ్మిదేళ్ల చిరుప్రాయంలోనే ఓ చిన్నారి ఒకేసారి రెండు రికార్డులను సొంతం చేసుకొంది. అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’, ‘తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన నట్ట లక్ష్మణ్, లక్ష్మి దంపతులు ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కూతురు వినూత్న హర్ష ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో నాట్య మయూరి ఆర్ట్స్, నాట్యం కూచిపూడి అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. దేశభక్తి గీతాలపై చక్కని హావభావాలతో ఆకట్టుకుంది. దీంతో నిర్వాహకులు వినూత్న హర్షను ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’, ‘తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు ఎంపిక చేశారు. ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. వీటితోపాటు 2014 ఉత్తమ నృత్య ప్రదర్శకురాలిగా మరో అవార్డును చిన్నారి సొంతం చేసుకుంది.