ఒంటరిగా ఉన్న బాలిక పై కన్నేసిన ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ప్రతిఘటించిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం రామన్నగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక(16) ఇటీవలే ఇంటర్ పరీక్షలు పూర్తిచేసి ఇంటి దగ్గరే ఉంటోంది.
ఈ క్రమంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లిన సమయంలో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇంటిపక్కన ఉండే పల్లా సత్యనారాయణరెడ్డి(50) అనే వ్యక్తి ఆమె అఘాయిత్యం చేయడానికి యత్నించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన బాలిక బిగ్గరగా కేకలు వేసింది. ఇది గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోపే అతను అక్కడి నుంచి పరారయ్యాడు. గురువారం బాలిక తల్లిదండ్రుల సాయంతో సత్యనారాయణరెడ్డి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు.