సంతానం కోసం మందులు ఇస్తానని మోసం
Published Wed, Jul 12 2017 11:11 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM
♦ రూ.5500లతో ఉడాయించిన గుర్తుతెలియని వ్యక్తి
మంచిర్యాల: సంతానం లేనివారికి సంతానం కలిగేవిధంగా మందులు ఇస్తానని నమ్మబలికి ఓ గుర్తుతెలియని వ్యక్తి రూ.5500 వసూలు చేసుకొని ఉడాయించిన సంఘటన మంచిర్యాల్లో చోటుచేసుకోంది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఏసీసీ గొల్లవాడకు చెందిన ఈర్ల శ్రీను, సృజన దంపతులకు పిల్లలు లేరు. వారి ఇంటికి మంగళవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆయుర్వేద వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. వారికి పిల్లలు లేరనే విషయాన్ని స్థానిక అంగన్‌వాడీ సూపర్‌వైజర్ చెప్పారని, ఆమె సూచన మేరకు మందులు ఇచ్చేందుకు వచ్చానని నమ్మబలికాడు.
తాను ఇచ్చే ఆయుర్వేద మందులు వాడితే సంతానం కలుగుతుందని, ఇందుకు రూ.5500 ఖర్చవుతుందని చెప్పాడు. అతడి మాటలు నమ్మి డబ్బులు ఇవ్వడంతో శ్రీనుకు ఏదో మందు తాగించి, సృజనకు ఇంజక్షన్ ఇచ్చాడు. తాను వారం రోజులకు మళ్లీ వస్తానంటూ ఓ సెల్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు. తర్వాత అనుమానం వచ్చిన శ్రీను అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ను సంప్రదించగా.. తాను ఎవరినీ పంపలేదని పేర్కొన్నారు. దీంతో తాము మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నారు.
Advertisement