మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ చిట్టీల వ్యాపారి పలువురిని నిండా ముంచాడు. రూ.2 కోట్ల మేర దండుకుని ఉడాయించాడు. దీంతో బాధితులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. పట్టణానికి చెందిన గుండా విజయ్ స్థానికంగా చిట్టీలతోపాటు బియ్యం వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో సుమారు 25 మందికి రూ.2 కోట్ల మేర ఇవ్వాల్సి ఉంది. తీరా మూడు రోజుల క్రితం విజయ్ పరారు కావడంతో బాధితులు శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో అఫ్జల్ ఖాన్, జి.శ్రీను, పద్మా సత్యనారాయణ ఉన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.