క్రేజున్నోడు..!
కొత్త సినిమా గురూ!
సీన్ ఓపెన్ చేస్తే... హీరో ఎలాంటి గొడవల జోలికి వెళ్లని నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు. అప్పటివరకూ సాధారణ వ్యక్తిగా కనిపించిన హీరో సడన్‌గా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో సూపర్ హీరోగా మారతాడు. తన ఫ్యామిలీ జోలికి వచ్చిన వాళ్లను తుక్కుతుక్కుగా చితక్కొడతాడు. హీరో రెండో కోణాన్ని ఆవిష్కరించేదే సెకండాఫ్. ఇలాంటి కథలకు ఆజ్యం పోసిన చిత్రం ‘బాషా’. తాజాగా తెర మీదకొచ్చిన తమిళ ‘తెరి’ అటూ ఇటూగా ఈ బాపతుకి చెందిన సినిమానే. విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘బాషా’ పోలికలతో ఉన్న లైన్‌ను తీసుకుని విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా అట్లీ తీసిన ఈ చిత్రం తెలుగులోకి ‘పోలీస్’గా విడుదలైంది. నిర్మాత ‘దిల్’ రాజు, ‘ఘర్షణ’ ఫేమ్ కలైపులి.ఎస్ థాను ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
కథ ఏంటంటే... కేరళలోని ఓ మారుమూల గ్రామంలో బేకరి నడిపే జోసఫ్ కురువెల్లా (విజయ్) తన కూతురు నివేదిత (నైనిక)తో కలిసి హాయిగా లైఫ్‌ను గడుపుతూ ఉంటాడు. నివేదిత టీచర్ యాని (అమీ జాక్సన్) అతన్ని ప్రేమిస్తుంది. ఓ రోజు యానీతో కలిసి నివీ బైక్ మీద స్కూల్‌కు వెళుతున్న సమయంలో అక్కడి లోకల్ రౌడీలు తమ కారుతో డ్యాష్ ఇస్తారు. దాంతో యానీ వాళ్లందరి మీద పోలీసుల మీద కంప్లయింట్ ఇస్తుంది. ఎఫ్‌ఐఆర్‌లో నివీ పేరు కూడా ఉండటంతో గొడవ లన్నిటికీ దూరంగా ఉండే జోసఫ్ ఫిర్యాదు వెనక్కి తీసుకుంటాడు. అప్పుడు పోలీస్ స్టేషన్‌లో జోసఫ్‌ను గుర్తుపట్టి మీరు పోలీసా? అని అడగడంతో యానీకి జోసఫ్ మీద డౌట్ వస్తుంది. అతని గురించి గూగుల్లో సెర్చ్ చేయగానే అతనో పోలీసాఫీసర్ అని యానీకి తెలుస్తుంది.
అదే సమయంలో రౌడీలు జోసఫ్ ఇంటికి వచ్చి అతన్ని ఇష్టమొచ్చినట్లు కొడుతూ ఉంటారు. అప్పటివరకూ దెబ్బలు తిన్న జోసఫ్ తన కూతురును కూడా చంపేయబోతుంటే వాళ్లకు ఎదురుతిరిగి చితక్కొడతాడు. అప్పుడే జోసఫ్ ఇంటికి వచ్చిన యానీకి తన గతం గురించి చెప్పుకొస్తాడు జోసఫ్. సిటీ లో డిప్యూటీ కమిషన ర్ ఆఫ్ పోలీస్ విజయ్‌కుమార్ (విజయ్) అంటే రౌడీలకు హడల్. మిత్ర (సమంత)ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడు. ఓ అమ్మాయి అత్యాచార కేసును పరిష్కరించే క్రమంలో ఓ మంత్రి కొడుకును ఎన్‌కౌంటర్ చేస్తాడు విజయ్. దాంతో ఆ మంత్రి పగబడతాడు. విజయ్, మిత్రలకు పుట్టిన అమ్మాయే నివేదిత. మంత్రి తన అనుచరులతో వచ్చి, మిత్ర, విజయ్ తల్లిని చంపేస్తారు. విజయ్‌ను కూడా చంపేయడానికి ప్రయత్నిస్తారు.
అయితే విజయ్ తన కూతురితో తప్పించుకుంటాడు. మిత్ర చనిపోతున్న సమయంలో పోలీస్ ఉద్యోగం వదిలే సి, ఓ మంచి తండ్రిగా నివేదితను పెంచాలని చెప్పడంతో విజయ్ అజ్ఞాతంలోకి వెళిపోతాడు. ప్రజలకు విజయ్ చనిపోయినట్టే లెక్క. కానీ, కాలక్రమంలో ఆ మంత్రికి విజయ్ బతికే ఉన్నాడని తెలుసుకుని నివేదిత వెళుతున్న స్కూల్ బస్‌కు ప్రమాదం జరిగేలా చేస్తాడు. విలన్ ఇన్నేళ్ల తర్వాత కూడా తన కూతురినే టచ్ చేయాలని ప్రయత్నించడంతో, ఇక అప్పుడు సిటీలోకి విజయ్ ఎంటరవుతాడు... ఆ తర్వాత విలన్లతో ఎలా ఆడుకున్నాడన్నదే మిగతా కథ.
‘కత్తి’ తర్వాత రెండోసారి జతకట్టిన విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ, వాళ్లిద్దరి రొమాన్స్ గిలిగింతలు పెట్టే విధంగా ఉంది. మీనా కూతురు నివేదిత నటన ముచ్చటగా ఉంది. కొన్ని సన్నివేశాలు ‘అరె ఎక్కడో చూశామే’ అన్న భావం కలిగించినా అట్లీ తన టేకింగ్‌తో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. ప్రచార చిత్రం, టీజర్‌లలో కనిపించిన కొత్తదనాన్ని సినిమాలోనూ ఆశిస్తే నిరాశే మిగులుతుంది. అయితే సక్సెస్‌ఫుల్ ఫార్ములా కాబట్టి, కొత్త సీసాలో పాత నీరు అయినా ఓకే అనొచ్చు!