
కాబోయే భార్యపై అత్యాచారయత్నం
ఇంట్లో ఒంటరిగా ఉన్న కాబోయే భార్యపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
వరంగల్( కాజీపేట) :
ఇంట్లో ఒంటరిగా ఉన్న కాబోయే భార్యపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట సీఐ రమేష్‌కుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. కాజీపేట చింతల్‌బస్తీకి చెందిన ఓ యువతికి గత నెల 22న హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన పోన్నాల ప్రభుదాసు అనే యువకుడితో నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. ఇరువర్గాలకు చెందిన పెద్దమనుషుల సమక్షంలో కట్నకానుకలు మాట్లాడుకోవడంతో పాటు వరపూజ, పూలపండ్లు అదే రోజు చేసుకోవాలని ఇరువర్గాల వారు ఒప్పుకున్నారు.
ఎలాగు పెళ్లి చేసుకునే అమ్మాయే కదా అని నిశ్చితార్థ సమయానికి రెండు రోజుల ముందే (గతనెల 20న) చింతల్‌బస్తీకి వచ్చిన ప్రభుదాసు ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఆత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన యువతి కేకలు వేయడంతో ప్రభుదాసు పరారయ్యాడు. ఆ తరువాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పి యువతి భోరున విలపించింది. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులు పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లగా మాట్లాడుదామని నచ్చ చెప్పి పంపించారు.
వీటన్నింటిని మనసులో పెట్టుకున్న ప్రభుదాసు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదనపు కట్నం ఇస్తేనే వివాహం కుదుర్చుకుంటామని డిమాండ్ చేశారు. దీంతో సోమవారం బాధితురాలు కుటుంబ సభ్యులతో కాజీపేట పోలీసుస్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.