- తెలంగాణ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డు నంబర్ ఇవ్వని లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి ‘ఆసరా’ పింఛన్లను నిలిపివేయాలని అధికారులకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ ఆదేశిం చారు. ఫిబ్రవరి నుంచి ఇచ్చే పింఛన్లను పోస్టాఫీసులు లేదా బ్యాంకుల ద్వారానే అందించాలని.. ఇందుకోసం ఖాతాల వివరాలను సేకరించాలని సూచించారు. డిసెంబర్ నెల పింఛన్లు ఎట్టి పరి స్థితుల్లోనూ సంక్రాంతిలోగా లబ్ధిదారులకు అం దించాలని స్పష్టం చేశారు.
శుక్రవారం సచివాల యం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల అధికారులతో పింఛన్లు, వాటర్‌గ్రిడ్, రహదారుల నిర్మాణం తదితర అంశాలపై రేమండ్ పీటర్ సమీక్షించారు. జనవరి తర్వాత సామాజిక తనిఖీ నిర్వహించే అవకాశం ఉన్నం దున నగదు పంపిణీ పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
ఆసరా పింఛన్లకు అర్హులైన, అనర్హులైన వారి జాబితాలను గ్రామ సభల్లో వెల్లడించాలని, అలాగే ఆధార్ కార్డులు లేనివారు వెంటనే నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సదరం సర్టిఫికెట్లు లేని వికలాంగులకు వాటిని వెంటనే ఇప్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ పనులను సంక్రాంతి తర్వాత ప్రారంభించవచ్చని, దీనిపై సీఎం ఆదివారం స్వయంగా సమీక్షిస్తారని చెప్పారు.