విత్తన సరఫరాకు ఆధార్ లింకేజీ
► ఈసారి నుంచి అంతా ఆన్‌లైన్‌లోనే..
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ విత్తన సరఫరాను ఆధార్‌తో లింక్ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఆన్‌లైన్లో ఆధార్ నంబర్ నమోదు చేస్తేనే సబ్సిడీ వర్తించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్ తెలిపారు. తద్వారా సబ్సిడీ అక్రమార్కుల చేతికి వెళ్లకుండా అడ్డుకోగలమని వివరించారు.
మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని సబ్సిడీ విత్తన విక్రయ కేంద్రాల్లో రైతులు.. తమకు కావాల్సిన విత్తనాల పరిమాణం, పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు వివరాలు తెలిపి సబ్సిడీ పోను మిగిలిన సొమ్ము చెల్లించాలని, రైతు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాకే విత్తనాలు అందజేస్తారని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పద్ధతి లేకపోవడంతో రైతుల పేరుతో అనేకమంది విత్తనాలను కొనుగోలు చేసి పక్కదారి పట్టించారని జగన్‌మోహన్ తెలిపారు. ఆన్‌లైన్‌తో అవినీతికి అవకాశం ఉండదన్నారు. ఈ ఏడాది వరి, సోయాబీన్, కంది, పెసర తదితర విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, కొత్త విధానంతో ఆధార్ కార్డున్న రైతులకే విత్తన సబ్సిడీ లభించనుంది.