వరంగల్ జిల్లాలో ఆదిమానవుల ఆనవాళ్లు
రఘునాథపల్లి: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్దనగిరిలోని గోపాలస్వామి గుట్టపై ఆది మానవులు నివసించిన ఆనవాళ్లను జనగామ చరిత్ర పరిశోధకుడు ఆర్ రత్నాకర్‌రెడ్డి సేకరించారు. మూడేళ్లుగా జనగామ చుట్టుపక్కల గ్రామాల్లో పురావస్తు చరిత్ర పరిశోదన చేస్తున్న ఆయన శుక్రవారం గోపాలస్వామి గుట్టపై నవీన శిలా యుగానికి చెందిన పలు ఆధారాలను విలేకరుల సమావేశంలో వివరించారు.
గుట్ట చుట్టూరా 100 ఎకరాల్లో అక్కడక్కడ డోల్మన్లు, పిస్తులు రకపు సమాధులతోపాటు పాటిగడ్డ ఉందని, అక్కడ వృత్తాకారంలో అమర్చిన రాతి గుండ్ల మధ్య ఆ కాలానికి చెందిన శవాలను పూడ్చి వేసినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అక్కడ రాతి గొడ్డళ్లు, నూరుడు రాళ్లు, బాణం గుర్తులాంటి సూక్ష్మ పరి కరాలు, దంపుడు, నూరుడు రాళ్లు, మృణ్మయ పాత్ర లు, నిప్పులు రగిలించే చెకుముకి రాళ్లు ఉన్నాయని చెప్పారు.
గుట్టపై శివాల యం ఉందని, సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్పారు. క్రీ.పూ 500 సంవత్సరంలో ఆదిమానవులు నివసించినట్లు ఆనవాళ్లు కన్పిస్తున్నందున ప్రభుత్వం ఇక్కడి చరిత్రను భద్రపరిచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరారు.