‘ఆసరా’.. అక్రమార్కుల పరం!
కొత్తగూడెంలో సోషల్ ఆడిట్ బృందాల తనిఖీ
వెలుగుచూసిన అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: అక్రమార్కులకు ‘ఆసరా’ అవుతోంది. ప్రజాధనం పక్కదారి పడుతోం ది. అనర్హులకు లబ్ధి చేకూరుతోంది.
అర్హుల్లో చాలామంది ‘ఆసరా’ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇదీ సామాజిక భద్రతా పింఛన్ల పథకం‘ఆసరా’ పథకం అమలవుతున్న తీరు. ఆసరా పథకం అమలులో అధికారుల లీలలెన్నో! ఆసరా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 32.46 లక్షల మందికి ప్రతినెలా సుమారు రూ.400 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పింఛను పొందుతున్నవారిలో మూడింట ఒకవంతు మంది అక్రమార్కులు ఉన్నారని, సుమారు రూ.వందకోట్లు అనర్హులకు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నా యి.
ఆసరా పింఛన్లపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌ఫరెన్సీ(శాట్) బృందాలు తాజాగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో తనిఖీ చేశాయి. ఈ మున్సిపాల్టీలో మంజూరైన పింఛన్లలో 37.15 శాతం అక్రమమేనని సోషల్ ఆడిట్ బృందాలు తేల్చాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో జరిగిన‘ఆసరా’ అక్రమాలపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ నేపథ్యంలో దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ సోషల్ ఆడిట్ చేయించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.
కొత్తగూడెం మున్సిపాల్టీల్లో..
మొదటి భర్త నుంచి విడాకులు తీసుకొని రెండో భర్తతో ఉంటున్న పలువురు మహిళలు వితంతు పింఛన్లు పొందుతున్నారు. 40 శాతం కన్నా తక్కువ వైకల్యమున్నవారు, సింగరేణి కాలరీస్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు, వారి కుటుంబ సభ్యులకు ఆసరా పింఛన్లు లభిస్తున్నాయి. మూడంతస్తుల భవనాలు, స్విఫ్ట్ డిజైర్ కార్లున్న కుటుంబాల సభ్యులకు కూడా పింఛన్లు మంజూరయ్యాయి. స్థానికంగా ఎటువంటి గుర్తింపు కార్డులేని ఇతర ప్రాంతాలవారికి కూడా పింఛన్లు వస్తున్నాయి.
జ్యువలరీ, మిఠాయి, కిరాణ దుకాణాలు నిర్వహిస్తున్నవారి కుటుంబాల్లోనూ ఆసరా పెన్షనర్లు ఉన్నారు. కొన్ని వార్డుల్లో అర్హత కలిగినవారి పింఛను సొమ్మును డ్రా చేసిన కొందరు అధికారులు ఆ సొమ్మును లబ్ధిదారులకు అందజేయలేదని తేలింది. అర్హత కలిగిన ఎంతోమంది తమకు పింఛను ఇవ్వలేదంటూ సోషల్ ఆడిట్ బృందాలకు ఫిర్యాదు చేశారు. కేవలం దరఖాస్తులు, వాటికి జత చేసిన పత్రాలతోనే సిబ్బంది విచారణ పూర్తి చేసి, క్షేత్రస్థాయి పరిశీలనను విస్మరించారనే విష యం వెల్లడైంది. లబ్ధిదారుల వివరాలను డేటా ఎంట్రీ చేసే ప్రక్రియను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం కూడా ఈ అక్రమాలకు మరో కారణమని తేలింది.
వెరిఫికేషన్ జరిగింది ఇలా..
మొత్తం పింఛన్లు 8,311
వెరిఫికేషన్ చేసినది 7,868 (94.67శాతం)
వెల్లడైన అక్రమ పింఛన్లు 2,923
అక్రమార్కుల పాలైన సొమ్ము 87,35,500