అక్రమార్కులకు ‘ఉపాధి’
రూ.792.23 కోట్ల పనుల్లో రూ.75.35 కోట్లు దుర్వినియోగం
తేల్చిన సోషల్ ఆడిట్ బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం.. అక్రమార్కులకు ఉపాధినిస్తోంది. గత ఏడాది జరిగిన ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీ చేయగా కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి చేరినట్లు వెల్లడైంది. తాము అక్రమాలకు పాల్పడినట్లు ఉపాధి హామీ సిబ్బంది అంగీకరించినప్పటికీ, వారి వద్ద నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం. సిబ్బంది నొక్కేసిన సొమ్ములో పైస్థాయి అధికారులకు కూడా వాటాలు ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గత ఏడాది రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం కింద సుమారు రూ.1,800 కోట్ల విలువైన పనులు జరిగాయి.
దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉపాధి హామీ అక్రమార్కులకు వరంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో గత ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 30 వరకు అధికారులు సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఏడు నెలల్లో రూ.792.23 కోట్ల విలువైన పనులను సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీ చేయగా రూ.75.35 కోట్ల(9.51శాతం) సొమ్ము దుర్వినియోగమైనట్లు తేలింది. ఇందులో రూ.60.11 కోట్ల (80 శాతం) సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు ఆడిట్ అధికారులు తేల్చారు. కాగా, ఇప్పటి వరకు రికవరీ చేసినది రూ.3 లక్షలే కావడం గమనార్హం.
ఆదిలాబాద్‌లో అత్యధికంగా అక్రమాలు
ఉపాధి హామీ పనుల్లో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో రూ.19 కోట్లు దుర్వినియోగమైనట్లు తనిఖీల్లో తేలింది. నల్లగొండ జిల్లాలో 14.38 కోట్లు, మహబూబ్‌నగర్ 9.50 కోట్లు, నిజామాబాద్ 7.30 కోట్లు, మెదక్ రూ.7.01 కోట్లు, వరంగల్ రూ.6.85 కోట్లు, కరీంనగర్ 6.13 కోట్లు, రంగారెడ్డి 2.67 కోట్లు, ఖమ్మం రూ. 2.50 కోట్లు దుర్వినియోగమైనట్లు సమాచారం.
వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన కొన్ని అక్రమాలు
చిట్యాల మండలం కుమ్మరిపల్లిలో జరిగిన పనిని ఒక గ్రూపునకు చెందిన 14 మంది కూలీలు పనిచేశారు. అయితే.. అక్కడ పనిచేసే ఉద్యోగి(మేట్) నర్సయ్య 9 మంది కుటుంబ సభ్యులు, బంధువులు అదే పని చేసినట్లు అదనంగా లెక్కలు చూపారు. అదే గ్రామంలో ఒక నర్సరీలో కూలీలు గోడిశాల విజయ, ఆమె కుమారుడు రాజేందర్ 84 రోజులు పనిచేసినట్లు స్థానిక ఉద్యోగి ఫీల్డ్ అసిస్టెంట్(ఎఫ్‌ఏ) సతీష్ లెక్కల్లో చూపారు. గ్రామసభలో విచారించగా తాము పనిచేయలేదని, మస్టర్‌లో సంతకాలు తమవి కావని వారు పేర్కొన్నారు.
భావ్‌సింగ్‌పల్లిలో 200 మామిడి మొక్కల పెంపకానికి రూ.25,229 ఖర్చు చేసినట్లు ఉపాధి సిబ్బంది లెక్కలు చూపారు. సోషల్ ఆడిట్ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఒక్క మొక్క కూడా కనిపించలేదు.
చిట్యాలలో రోడ్ ఫార్మేషన్ నిమిత్తం 874 క్యూబిక్ మీటర్ల పని కోసం రూ.1.07 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పేర్కొనగా, సోషల్ ఆడిట్‌లో 589 క్యూబిక్ మీటర్ల మేరకే పని జరిగినట్లు తేలింది.