‘ఉపాధి’లో అన్నీ అవకతవకలే.. | Employment' all manipulations | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో అన్నీ అవకతవకలే..

Published Mon, May 25 2015 11:32 PM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

Employment' all manipulations

సామాజిక తనిఖీలో నిగ్గుతేల్చిన అధికారులు
యాలాల: ఉపాధి హామీ పథకంలో అన్నీ అవకతవకలే చోటుచేసుకున్నాయి. మండల పరిషత్ కార్యాలయంలో 8వ సామాజిక తనిఖీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌రెడ్డి, డీవీఓ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. మండలంలో 24 గ్రామ పంచాయతీలకు 2014-15 సంవత్సరంలో 8 నెలల పనికిగాను రూ.96 లక్షల పనులు జరిగాయి. ఇందులో అన్ని గ్రామాల్లో ఉపాధి కూలీల డబ్బుల విషయమై అవకతవకలు జరిగాయి. వననర్సరీలో మొక్కల పెంపకంలో  సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మొక్కలు వృథాగా పోయా యి. ముందుగా జుంటుపల్లి గ్రామం సామాజిక తనిఖీ జరిగింది.

జుంటుపల్లి గ్రామంలో రూ.6 లక్షలకుపైగా పనులు చెస్తే ఫీల్డ్ అసిస్టెంట్ రూ.లక్షకుపైగా పనుల రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వలేదని తేలింది. గ్రామంలో 19 గ్రూపులకు పనికల్పించ లేదని ఫీల్డ్ అసిస్టెంట్‌పై కూలీలు ఫిర్యాదు చేశారు. పనులు చేసినా టెక్నికల్ అసిస్టెంట్ ఉదయ్‌కుమార్ మూడు నెలల తర్వాత మేజర్‌మెంట్ చేయడంతో కూలీలు డబ్బులు నష్టపోయారని చెప్పారు. బానాపూర్‌లో 13 గ్రూపులకు పనికల్పించడం లేదని కూలీలు సామాజిక తనిఖీ బృందానికి ఫిర్యాదు చే శారు. పగిడ్యాల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సాయిరెడ్డి, రూ.54 వేల పనుల రికార్డులు తనిఖీ బృందానికి రికార్డు ఇవ్వలేదని సామాజిక తనిఖీలో తేలింది. తగిన పని కన్నా ఎక్కువ ల్యాండ్ లెవలింగ్ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కొత్తగా జాబ్‌కార్డులు ఎంట్రీ చేయడం లేదని చెప్పారు.

నాగసమందర్ గ్రామంలో పనులకు ఫీల్డ్ అసిస్టెంట్ దరఖాస్తులు తీసుకోవడం లేదని గ్రామస్తులు సామాజిక తనిఖీ బృందానికి ఫిర్యాదు చేశారు. గ్రామసభల తిర్మానాలు సామజిక బృందానికి ఇవ్వలేదు. అన్నాసాగర్‌లో ఏడుగురు రైతులు గుంతలు తవ్వినా.. మొక్కలు నాటకుండా రూ.19 వేలు డబ్బులు డ్రా చేశారని తేలింది. కొకట్ గ్రామంలో పనులకు సంబంధించిన తీర్మానాలు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదని అధికారులు గుర్తించారు. 95 రోజులు పనిచేసిన 25 మంది కూలీకు డబ్బులు ఇవ్వలేదని తేలింది. ముద్దాయిపేట్, రాఘవపూర్, తిమ్మాయిపల్లి, రాస్నం, దేవనూర్, హాజిపూర్, బెన్నూర్‌తోపాటు పలు గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనుల్లో అన్నీ అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ అధికారులు గుర్తించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సౌజన్య, ఎంపీపీ సాయన్నగౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement