social inspection
-
బయటకే వెళ్తాం!
నిజామాబాద్ జిల్లా నుంచి పాత బాలప్రసాద్: వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగానికి వృద్ధులు నిరాకరిస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. మరుగుదొడ్లలో మలవిసర్జన చేయడం వాళ్లకు ముందు నుంచీ’ అలవాటు లేకపోవడంతో వీటిని వినియోగిం చడం లేదని వృద్ధులు చెబుతున్నారు. వంద శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం సామాజిక తనిఖీలు నిర్వహిస్తోంది. సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబులిటీ, ట్రాన్స్పరెన్సీ (ఎస్‌ఎస్‌ఏఏపీ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా సామాజిక తనిఖీ జరుగుతోంది. ప్రత్యేక ఆడిట్ బృందాలు గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకున్నారా? కుటుంబసభ్యులందరూ వాడుతున్నారా? వంటి వివరాలు సేకరిస్తున్న సమయంలో వృద్ధులు వీటి వినియోగానికి ఆసక్తి చూపడం లేదన్న విషయం బయటపడింది. ఇప్పటికే వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఈ సామాజిక తనిఖీ పూర్తయ్యాయి. ప్రస్తుతం నిజామాబాద్, మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ కింద.. బహిరంగ మల విసర్జనతో అంటు వ్యాధులు ప్రబలి.. ప్రజలు అనారోగ్యం పాలవుతుండడంతో ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్ఛభారత్ మిషన్ వంటి పథకాల ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉపాధిహామీ పథకం కింద కూడా లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకున్న ప్పటికీ చాలా కుటుంబాలు వాటిని వినియోగించడం లేదని అధికారుల తనిఖీల్లో తేలింది. కుటుంబంలో ఒకరిద్దరు బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు వీరి పరిశీలనలో తేలింది. రాష్ట్రంలో మరుగుదొడ్ల వినియోగంపై 2012లో ప్రభుత్వం సర్వే చేసింది. మొత్తం 43.91 లక్షల కుటుంబాల్లో 11.49 లక్షల కుటుంబాలకే వ్యక్తి గత మరుగుదొడ్లు ఉన్న ట్లు తేలింది. మిగిలిన 32.42 లక్షల కుటుంబా లు కూడా మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభు త్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఇప్ప టివరకు 16.42 లక్షల టాయిలెట్స్ నిర్మించారు. ఇదీ మరుగుదొడ్ల లెక్క.. మరుగుదొడ్లు ఉన్న కుటుంబాలు : 11.49 లక్షలు (2012 సర్వే) ఐదేళ్లలో నిర్మించిన మరుగుదొడ్లు : 16.42 లక్షలు ఓడీఎఫ్ జిల్లాలు : నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, రాజన్న సిరిసిల్ల ఆరు జిల్లాల్లో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగినట్లు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రకటించింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, నిజామాబాద్, సిరిసిల్లలను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) జిల్లాలుగా పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించు కునేలా లబ్ధిదారులను ప్రోత్సహించారు. నిర్మించు కోని వారికి పింఛన్లు, రేషన్ సరుకులు నిలిపివేస్తామనీ ప్రకటించారు. దీంతో అన్ని కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నాయి. -
కొనసాగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక
కందుకూరు : మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద 2015 సెప్టెంబర్ నెల నుంచి మే 31, 2016 వరకు జరిగిన 1982 పనులకు గాను అయిన రూ.6.50 కోట్ల ఖర్చుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ప్రజావేదిక ద్వారా సామాజిక తనఖీ నిర్వహించారు. డ్వామా అదనపు పీడీ జాన్సన్, జిల్లా విజిలెన్స్ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో గ్రామాల వారీగా చేపట్టిన ఉపాధి పనులను సమీక్షించారు. మేట్లు హాజరు పట్టికలో కూలీల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం పట్ల బాధ్యులుగా క్షేత్ర సహాయకుల్ని చేస్తూ వారికి జరిమానా విధించారు. రైతుల పొలాల్లో నిర్ణయించిన దాని కంటే అధికంగా పనులు చేపట్టడం, కొంత మంది పొలాల్లో తక్కువగా పనులు చేయించడం, కొలతల్లో వ్యత్యాసాలను గుర్తించారు. మార్చి నెలలోపు వంద రోజుల కంటే అదనంగా పని దినాలు చేసిన కుటుంబాలకు ఏప్రిల్‌లో మిగతా డబ్బు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఎందుకు తీసుకోలేదని ఈ సందర్భంగా అధికారుల్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏపీడీ తిరుపతయ్య, ఎంపీడీఓ అనూరాధ, డీఆర్డీఏ ఏపీడీ ఉమాదేవి, ఏపీఓ రవీందర్‌రెడ్డి, సోషల్ ఆడిట్ టీం హెడ్ రజిత, ఎస్ఆర్పీలు రాజు, వెంకటేష్, టీఏలు, ఉపాధి సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కూలీలు పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో అన్నీ అవకతవకలే..
సామాజిక తనిఖీలో నిగ్గుతేల్చిన అధికారులు యాలాల: ఉపాధి హామీ పథకంలో అన్నీ అవకతవకలే చోటుచేసుకున్నాయి. మండల పరిషత్ కార్యాలయంలో 8వ సామాజిక తనిఖీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌రెడ్డి, డీవీఓ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. మండలంలో 24 గ్రామ పంచాయతీలకు 2014-15 సంవత్సరంలో 8 నెలల పనికిగాను రూ.96 లక్షల పనులు జరిగాయి. ఇందులో అన్ని గ్రామాల్లో ఉపాధి కూలీల డబ్బుల విషయమై అవకతవకలు జరిగాయి. వననర్సరీలో మొక్కల పెంపకంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మొక్కలు వృథాగా పోయా యి. ముందుగా జుంటుపల్లి గ్రామం సామాజిక తనిఖీ జరిగింది. జుంటుపల్లి గ్రామంలో రూ.6 లక్షలకుపైగా పనులు చెస్తే ఫీల్డ్ అసిస్టెంట్ రూ.లక్షకుపైగా పనుల రికార్డులు తనిఖీ బృందానికి ఇవ్వలేదని తేలింది. గ్రామంలో 19 గ్రూపులకు పనికల్పించ లేదని ఫీల్డ్ అసిస్టెంట్‌పై కూలీలు ఫిర్యాదు చేశారు. పనులు చేసినా టెక్నికల్ అసిస్టెంట్ ఉదయ్‌కుమార్ మూడు నెలల తర్వాత మేజర్మెంట్ చేయడంతో కూలీలు డబ్బులు నష్టపోయారని చెప్పారు. బానాపూర్‌లో 13 గ్రూపులకు పనికల్పించడం లేదని కూలీలు సామాజిక తనిఖీ బృందానికి ఫిర్యాదు చే శారు. పగిడ్యాల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సాయిరెడ్డి, రూ.54 వేల పనుల రికార్డులు తనిఖీ బృందానికి రికార్డు ఇవ్వలేదని సామాజిక తనిఖీలో తేలింది. తగిన పని కన్నా ఎక్కువ ల్యాండ్ లెవలింగ్ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కొత్తగా జాబ్‌కార్డులు ఎంట్రీ చేయడం లేదని చెప్పారు. నాగసమందర్ గ్రామంలో పనులకు ఫీల్డ్ అసిస్టెంట్ దరఖాస్తులు తీసుకోవడం లేదని గ్రామస్తులు సామాజిక తనిఖీ బృందానికి ఫిర్యాదు చేశారు. గ్రామసభల తిర్మానాలు సామజిక బృందానికి ఇవ్వలేదు. అన్నాసాగర్‌లో ఏడుగురు రైతులు గుంతలు తవ్వినా.. మొక్కలు నాటకుండా రూ.19 వేలు డబ్బులు డ్రా చేశారని తేలింది. కొకట్ గ్రామంలో పనులకు సంబంధించిన తీర్మానాలు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదని అధికారులు గుర్తించారు. 95 రోజులు పనిచేసిన 25 మంది కూలీకు డబ్బులు ఇవ్వలేదని తేలింది. ముద్దాయిపేట్, రాఘవపూర్, తిమ్మాయిపల్లి, రాస్నం, దేవనూర్, హాజిపూర్, బెన్నూర్‌తోపాటు పలు గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనుల్లో అన్నీ అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ అధికారులు గుర్తించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సౌజన్య, ఎంపీపీ సాయన్నగౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
రుణమాఫీపై సామాజిక తనిఖీ
రీషెడ్యూల్కు ఆర్బీఐ అనుమతించకపోతే రైతులకు బాండ్ల జారీ! గ్రామ సభల్లో లబ్ధిదారుల పేర్ల ప్రకటన.. అభ్యంతరాల స్వీకరణ అనర్హులు, డూప్లికేట్ ఖాతాల గుర్తింపు.. పాస్ పుస్తకాల పరిశీలన తనిఖీ కోసం ఒక్కో మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారి ఒక్కో కుటుంబానికి మొత్తంగా రూ. లక్ష వరకే మాఫీ 4 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రీషెడ్యూల్కు అనుమతి ఇవ్వలేమంటున్న ఆర్బీఐ! రైతులకు ఊరట కల్పించాలంటూ ఆర్బీఐ గవర్నర్‌కు టీ సర్కారు లేఖ సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీలో భాగంగా నేరుగా రైతులకే బాండ్లు జారీ చేయాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అందులో భాగంగా సామాజిక తనిఖీని కూడా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా... ఈ పథకాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి మరీ లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు. ఒక్కో రైతు కుటుంబం ఎన్ని రుణాలు తీసుకుందనే విషయం దగ్గరి నుంచి.. పాస్ పుస్తకాల పరిశీలన దాకా అన్నీ పకడ్బందీగా చేపట్టనున్నారు. అర్హులైన రైతులకు మాత్రమే.. మొత్తం కుటుంబం ఎన్ని రుణాలు తీసుకున్నా రూ. లక్ష మేరకే మాఫీ చేయాలని నిర్ణయించారు. రిజర్వుబ్యాంకు రీషెడ్యూల్కు అనుమతించని నేపథ్యంలో... రైతులకు బాండ్లు జారీ చేయాలని యోచిస్తున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం... ముందుగా బ్యాంకులు రైతుల వారీగా ఇచ్చిన రుణాలు మొత్తం ఎంత? ఒక రైతుకు ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలున్నాయి? ఒక కుటుంబంలో ఎన్ని రుణాలున్నాయి? వారు మొత్తం కలిపి తీసుకున్న రుణాలు లక్షలోపు ఉన్నాయా? అన్న వివరాలను బ్యాంకులు సమర్పిస్తాయి. ఇందులో ఎక్కువ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను జల్లెడపట్టి ఒకే అకౌంట్‌కు రుణమాఫీని పరిమితం చేస్తారు. అయితే ఒక కుటుంబంలో వారందరికీ కలిపి రుణం రూ. లక్షలోపు ఉంటే.. అన్ని ఖాతాలకూ రుణ మాఫీని వర్తింపజేస్తారు. అలా కాకుండా ఒక ఖాతాలోనే రూ. లక్ష రుణం ఉంటే.. ఆ ఒక్కదానిని మాత్రమే మాఫీ చేస్తారు. మిగతా రుణాలను సంబంధిత రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ జాబితా మొత్తం తయారయ్యాక గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఈ రుణ మాఫీ లబ్ధిదారులు ఉన్నారా? లేక ఉల్లంఘనలు ఉన్నాయా? అన్న అంశాన్ని సామాజిక తనిఖీ ద్వారా పరిశీలిస్తారు. అయితే ఒకే పాస్ పుస్తకంపై యజమాని, ఆ తరువాత అదే పాస్ పుస్తకంతో కౌలుదారుగా పేర్కొంటూ మరో పేరుమీద రుణాలు తీసుకున్న ఘటనలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అందువల్ల వాటన్నింటినీ తహసీల్దార్ పరిశీలిస్తారని తెలిపాయి. సామాజిక తనిఖీ కోసం ప్రతీ మండలంలో ఒక డిప్యూటీ కలెక్టర్ హోదా ఉన్న అధికారి నేతృత్వంలో తనిఖీ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించాయి. బాండ్ల అంశాన్ని పరిశీలిస్తున్నాం.. రుణమాఫీకి సంబంధించి రైతులకు బాండ్లు జారీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రిజర్వు బ్యాంకు పంట రుణాల రీషెడ్యూల్కు సంబంధించి స్పష్టత ఇవ్వడం లేదని వెల్లడించాయి. దాంతోపాటు ఒకేసారి బ్యాంకులకు రూ. 17వేల కోట్లకు పైగా చెల్లించడం సాధ్యం పడదని.. ఈ నేపథ్యంలో రైతులకు బాండ్లు జారీ చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆర్బీఐ తన పరిధిని అతిక్రమిస్తోంది.. రిజర్వుబ్యాంకు దేశంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని ప్రభుత్వ వర్గాలు మండిపడుతున్నాయి. 90రోజులు దాటిన కరువు లేదా వరదలతో పంట నష్టపోయిన రైతులకు రుణాలు రీ షెడ్యూల్ చేయాలా? లేదా? అన్న అంశంపైనే నిర్ణయం చెప్పాలే తప్ప.. పంట దిగుబడుల అంశం ఆర్బీఐ పరిధిలోనిది కాదని వ్యాఖ్యానిస్తున్నాయి. ఆర్బీఐ రీషెడ్యూల్కు అనుమతించిన వంద మండలాల ఎంపికలోనూ ఎలాంటి శాస్త్రీయత లేదని స్పష్టం చేశాయి. రైతులకు ప్రస్తుతం వందశాతం పంట దిగుబడి వస్తే తప్ప... లాభం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ రిజర్వుబ్యాంకు తీసుకున్న 50 శాతం నష్టం కొలమానం అయితే.. రైతులు మరో 40 శాతం నష్టపోయినట్లేనని చెబుతున్నాయి. రైతులు ఇప్పుడు విత్తనాలు, ఎరువులు, కూలీలు ఇలా అన్నిరకాల వ్యయంలో 90 శాతం బయట నుంచి తెచ్చుకోవాల్సిందేనని చెప్పినా ఆర్బీఐ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్బీఐ అధికారికంగా ఏమీ చెప్పడం లేదని, అనధికారికంగా మాత్రం మీకు రీషెడ్యూల్ చేస్తే.. త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇదే పద్ధతిలో వెళతాయని అనధికారికంగా చెబుతోందని తెలిపాయి. మరిన్ని మండలాలను చేర్చండి.. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన జాబితాలోని మండలాలను రీషెడ్యూల్ పరిధిలోకి చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ... తెలంగాణ ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌కు మరోసారి లేఖ రాశారు. నాలుగు సంవత్సరాలుగా ఏదో ఒక ఇబ్బందితో రైతులు నష్టపోతున్నారని, వారికి ఊరట ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే రిజర్వుబ్యాంకు గవర్నర్‌ను నేరుగా కలిసి పరిస్థితిని వివరించాలని ప్రభుత్వం భావించినా.. ఎలాంటి స్పందన లే కపోవడంతో సీఎస్ ఈ లేఖ రాశారు.