కొనసాగిన సామాజిక తనిఖీ ప్రజావేదిక
కందుకూరు : మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద 2015 సెప్టెంబర్ నెల నుంచి మే 31, 2016 వరకు జరిగిన 1982 పనులకు గాను అయిన రూ.6.50 కోట్ల ఖర్చుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ప్రజావేదిక ద్వారా సామాజిక తనఖీ నిర్వహించారు. డ్వామా అదనపు పీడీ జాన్సన్, జిల్లా విజిలెన్స్ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో గ్రామాల వారీగా చేపట్టిన ఉపాధి పనులను సమీక్షించారు. మేట్లు హాజరు పట్టికలో కూలీల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం పట్ల బాధ్యులుగా క్షేత్ర సహాయకుల్ని చేస్తూ వారికి జరిమానా విధించారు. రైతుల పొలాల్లో నిర్ణయించిన దాని కంటే అధికంగా పనులు చేపట్టడం, కొంత మంది పొలాల్లో తక్కువగా పనులు చేయించడం, కొలతల్లో వ్యత్యాసాలను గుర్తించారు. మార్చి నెలలోపు వంద రోజుల కంటే అదనంగా పని దినాలు చేసిన కుటుంబాలకు ఏప్రిల్‌లో మిగతా డబ్బు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఎందుకు తీసుకోలేదని ఈ సందర్భంగా అధికారుల్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏపీడీ తిరుపతయ్య, ఎంపీడీఓ అనూరాధ, డీఆర్‌డీఏ ఏపీడీ ఉమాదేవి, ఏపీఓ రవీందర్‌రెడ్డి, సోషల్ ఆడిట్ టీం హెడ్ రజిత, ఎస్‌ఆర్‌పీలు రాజు, వెంకటేష్, టీఏలు, ఉపాధి సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కూలీలు పాల్గొన్నారు.