రుణమాఫీపై సామాజిక తనిఖీ
రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ అనుమతించకపోతే రైతులకు బాండ్ల జారీ!
గ్రామ సభల్లో లబ్ధిదారుల పేర్ల ప్రకటన.. అభ్యంతరాల స్వీకరణ
అనర్హులు, డూప్లికేట్ ఖాతాల గుర్తింపు.. పాస్ పుస్తకాల పరిశీలన
తనిఖీ కోసం ఒక్కో మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారి
ఒక్కో కుటుంబానికి మొత్తంగా రూ. లక్ష వరకే మాఫీ
4 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రీషెడ్యూల్‌కు అనుమతి ఇవ్వలేమంటున్న ఆర్‌బీఐ!
రైతులకు ఊరట కల్పించాలంటూ ఆర్‌బీఐ గవర్నర్‌కు టీ సర్కారు లేఖ
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీలో భాగంగా నేరుగా రైతులకే బాండ్లు జారీ చేయాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అందులో భాగంగా సామాజిక తనిఖీని కూడా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా... ఈ పథకాన్ని పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి మరీ లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు. ఒక్కో రైతు కుటుంబం ఎన్ని రుణాలు తీసుకుందనే విషయం దగ్గరి నుంచి.. పాస్ పుస్తకాల పరిశీలన దాకా అన్నీ పకడ్బందీగా చేపట్టనున్నారు. అర్హులైన రైతులకు మాత్రమే.. మొత్తం కుటుంబం ఎన్ని రుణాలు తీసుకున్నా రూ. లక్ష మేరకే మాఫీ చేయాలని నిర్ణయించారు. రిజర్వుబ్యాంకు రీషెడ్యూల్‌కు అనుమతించని నేపథ్యంలో... రైతులకు బాండ్లు జారీ చేయాలని యోచిస్తున్నారు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం... ముందుగా బ్యాంకులు రైతుల వారీగా ఇచ్చిన రుణాలు మొత్తం ఎంత? ఒక రైతుకు ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలున్నాయి? ఒక కుటుంబంలో ఎన్ని రుణాలున్నాయి? వారు మొత్తం కలిపి తీసుకున్న రుణాలు లక్షలోపు ఉన్నాయా? అన్న వివరాలను బ్యాంకులు సమర్పిస్తాయి. ఇందులో ఎక్కువ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను జల్లెడపట్టి ఒకే అకౌంట్‌కు రుణమాఫీని పరిమితం చేస్తారు. అయితే ఒక కుటుంబంలో వారందరికీ కలిపి రుణం రూ. లక్షలోపు ఉంటే.. అన్ని ఖాతాలకూ రుణ మాఫీని వర్తింపజేస్తారు. అలా కాకుండా ఒక ఖాతాలోనే రూ. లక్ష రుణం ఉంటే.. ఆ ఒక్కదానిని మాత్రమే మాఫీ చేస్తారు. మిగతా రుణాలను సంబంధిత రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ జాబితా మొత్తం తయారయ్యాక గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఈ రుణ మాఫీ లబ్ధిదారులు ఉన్నారా? లేక ఉల్లంఘనలు ఉన్నాయా? అన్న అంశాన్ని సామాజిక తనిఖీ ద్వారా పరిశీలిస్తారు. అయితే ఒకే పాస్ పుస్తకంపై యజమాని, ఆ తరువాత అదే పాస్ పుస్తకంతో కౌలుదారుగా పేర్కొంటూ మరో పేరుమీద రుణాలు తీసుకున్న ఘటనలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అందువల్ల వాటన్నింటినీ తహసీల్దార్ పరిశీలిస్తారని తెలిపాయి. సామాజిక తనిఖీ కోసం ప్రతీ మండలంలో ఒక డిప్యూటీ కలెక్టర్ హోదా ఉన్న అధికారి నేతృత్వంలో తనిఖీ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించాయి.
బాండ్ల అంశాన్ని పరిశీలిస్తున్నాం..
రుణమాఫీకి సంబంధించి రైతులకు బాండ్లు జారీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రిజర్వు బ్యాంకు పంట రుణాల రీషెడ్యూల్‌కు సంబంధించి స్పష్టత ఇవ్వడం లేదని వెల్లడించాయి. దాంతోపాటు ఒకేసారి బ్యాంకులకు రూ. 17వేల కోట్లకు పైగా చెల్లించడం సాధ్యం పడదని.. ఈ నేపథ్యంలో రైతులకు బాండ్లు జారీ చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఆర్‌బీఐ తన పరిధిని అతిక్రమిస్తోంది..
రిజర్వుబ్యాంకు దేశంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని ప్రభుత్వ వర్గాలు మండిపడుతున్నాయి. 90రోజులు దాటిన కరువు లేదా వరదలతో పంట నష్టపోయిన రైతులకు రుణాలు రీ షెడ్యూల్ చేయాలా? లేదా? అన్న అంశంపైనే నిర్ణయం చెప్పాలే తప్ప.. పంట దిగుబడుల అంశం ఆర్‌బీఐ పరిధిలోనిది కాదని వ్యాఖ్యానిస్తున్నాయి. ఆర్‌బీఐ రీషెడ్యూల్‌కు అనుమతించిన వంద మండలాల ఎంపికలోనూ ఎలాంటి శాస్త్రీయత లేదని స్పష్టం చేశాయి. రైతులకు ప్రస్తుతం వందశాతం పంట దిగుబడి వస్తే తప్ప... లాభం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ రిజర్వుబ్యాంకు తీసుకున్న 50 శాతం నష్టం కొలమానం అయితే.. రైతులు మరో 40 శాతం నష్టపోయినట్లేనని చెబుతున్నాయి. రైతులు ఇప్పుడు విత్తనాలు, ఎరువులు, కూలీలు ఇలా అన్నిరకాల వ్యయంలో 90 శాతం బయట నుంచి తెచ్చుకోవాల్సిందేనని చెప్పినా ఆర్‌బీఐ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్‌బీఐ అధికారికంగా ఏమీ చెప్పడం లేదని, అనధికారికంగా మాత్రం మీకు రీషెడ్యూల్ చేస్తే.. త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇదే పద్ధతిలో వెళతాయని అనధికారికంగా చెబుతోందని తెలిపాయి.
మరిన్ని మండలాలను చేర్చండి..
రాష్ట్ర ప్రభుత్వం పంపించిన జాబితాలోని మండలాలను రీషెడ్యూల్ పరిధిలోకి చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ... తెలంగాణ ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌కు మరోసారి లేఖ రాశారు. నాలుగు సంవత్సరాలుగా ఏదో ఒక ఇబ్బందితో రైతులు నష్టపోతున్నారని, వారికి ఊరట ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే రిజర్వుబ్యాంకు గవర్నర్‌ను నేరుగా కలిసి పరిస్థితిని వివరించాలని ప్రభుత్వం భావించినా.. ఎలాంటి స్పందన లే కపోవడంతో సీఎస్ ఈ లేఖ రాశారు.