తహశీల్దార్‌ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది?  | Abdullapurmet Tahsildar Murder Case: Vijaya Reddy Children Shocked | Sakshi
Sakshi News home page

డాడీ.. మమ్మీకి ఏమైంది? 

Published Tue, Nov 5 2019 3:26 AM | Last Updated on Tue, Nov 5 2019 7:46 AM

Abdullapurmet Tahsildar Murder Case: Vijaya Reddy Children Shocked - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డాడీ.. మమ్మీకి ఏమైంది? ఇంటికి ఎప్పుడొస్తుంది? ఇప్పుడు వీళ్లంతా (బంధువులు) మన ఇంటికి ఎందుకొచ్చారు? అంటూ ఏడుస్తూ అమాయకంగా ఆ పసి హృదయాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తండ్రి సుభాశ్‌రెడ్డి సహా బంధువులంతా పిల్లలను గుండెలకు హత్తుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి విజయారెడ్డికి ఏం జరిగిందో తెలియక ఆ చిన్నారులు గుక్కపెట్టి ఏడుస్తుండటం అక్కడి వారిని తీవ్రంగా కలచి వేసింది. విజయారెడ్డి దంపతులకు కుమార్తె చైత్ర (10), కుమారుడు భువనసాయి (5) ఉన్నారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం కూడా తల్లి విజయారెడ్డి పిల్లలను స్కూలుకు రెడీ చేసి స్కూలుకు పంపింది. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు సజీవ దహనం అయిన తల్లికి ఏం జరిగిందో కూడా అర్థంగాక అమాయకంగా చూశారు. పిల్లల పరిస్థితి చూసి బంధువులు విలపించారు. 

టీచర్‌ నుంచి తహసీల్దార్‌ దాకా... 
మునుగోడు/నకిరేకల్‌/గరిడేపల్లి: నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన విజయారెడ్డి పెళ్లికి ముందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2006లో డీఎస్సీలో ఎస్‌జీటీ ఉద్యోగం రాగా ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం చిమిర్యాల ప్రాథమిక పాఠశాలలో ఆమె పనిచేశారు. 2007లో వివాహం అనంతరం ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్‌–2 పరీక్షలకు సిద్ధమయ్యారు. 2009లో వెలువడిన గ్రూప్‌–2 ఫలితాల్లో ఆమె డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగం సాధించారు. మొదట మెదక్‌ జిల్లా సంగారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహించారు. ఆ తరువాత అదే జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేసి నూతనంగా ఏర్పాటైన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలానికి తహసీల్దార్‌గా పదోన్నతిపై వచ్చారు. ఆమె భర్త సుభాష్‌రెడ్డి 2014లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం హయత్‌నగర్‌ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నారు. 

నకిరేకల్‌లో విషాద ఛాయలు 
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి మరణంతో ఆమె స్వగ్రామం నకిరేకల్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. వాస్తవానికి విజయారెడ్డి తల్లిదండ్రుల సొంత గ్రామం శాలిగౌరారం మండలం పెర్క కొండారంకాగా 30 ఏళ్ల క్రితమే నకిరేకల్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తండ్రి చామకురి లింగారెడ్డి, తల్లి వినోద. వారికి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు. కూమారుడు 10వ తరగతిలో ఉండగా మృతి చెందాడు. తండ్రి లింగారెడ్డి పెర్కకొండారం జెడ్పీ హైస్కూల్‌లో తెలుగు పండిట్‌గా పని చేసి మూడేళ్ల కిందట పదవీ విరమణ పొందారు. లింగారెడ్డి తన ఇద్దరు కూమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె సంధ్యారాణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా హైదారాబాద్‌లోనే పనిచేస్తున్నారు.

నేడు అంత్యక్రియలు 
అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి మరణవార్త తెలియగానే ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహానికి నివాళులు అరి్పంచారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆమె అంత్యక్రియలను మంగళవారం అత్తగారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లిలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement