హాలియా, న్యూస్‌లైన్, హాలియా అబార్షన్లకు అడ్డాగా మారింది. కొద్దికాలంగా స్థానిక పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో అబార్షన్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులపై వైద్య,ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పోలీసుల నిఘా కొరవడడంతో ఇక్కడ అబార్షన్లు, భ్రూణహత్యలు సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం మదారిగూడెం మేజర్‌కాల్వ వెంట గోడుమరక బజారు వీధిలో ఐదు నెలల పిండాన్ని కవర్‌లో కట్టి రోడ్డుపై వేయడం కలకలం సృష్టించింది.
హాలియాలో పదికి పైగా ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో పలు ఆర్‌ఎంపీ వైద్యశాలలు ఉన్నాయి. వీటిలో నిత్యం అబార్షన్లు జరిగిపోతున్నాయి. మండల పరిధిలోని గ్రామాల్లో ప్రేమపేరుతో వంచనకు గురైన యువతులు, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని వద్దనుకున్న మహిళలు అబార్షన్ల కోసం హాలియాకు వస్తున్నారు. వీరేగాక మిర్యాలగూడెం, నల్లగొండ తదితర పట్టణాల్లో నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అబార్షన్ల తర్వాత పసిగుడ్డులను కంపచెట్లలోకి, పంటకాల్వల్లోకి పారేయడం పరిపాటైంది.
అందుబాటులో లేని ప్రభుత్వ వైద్యసేవలు
హాలియాలో రెండేళ్ల క్రితం 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించినప్పటికీ నేటికీ వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో ఇక్కడ ఆర్‌ఎంపీల హవా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న పీహేచ్‌సీ ఊరికి దూరంగా ఉండటంతో అనారోగ్యంతో వచ్చిన ప్రజలు వైద్యం కోసం ఆర్‌ఎంపీ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ఆర్‌ఎంపీలు అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోడ్డుపైనే పారేశారు : బొల్లేపల్లి శేఖర్‌రాజు, హాలియా
హాలియాలో అబార్షన్లు చేయడం, పిండాలను చెత్తకుప్పల్లో, పంటకాల్వల్లో పడేయడం మామూలైంది. ఇటీవల మా వీధికి వెళ్లే దారిలో అబార్షన్ చేసిన పిండాన్ని రోడ్డుపై కవర్‌లో కట్టివేయడం ఇందుకు నిదర్శనం. ఆర్‌ఎంపీ వైద్యశాలలపై నిఘా ఉండాలి. అబార్షన్లు చేసేవారిపై చర్యలు తీసుకోవాలి.
హాలియాలో యథేచ్ఛగా అబార్షన్లు
Published Mon, May 5 2014 1:38 AM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM
Advertisement