చలో కలెక్టరేట్ ఉద్రిక్తం
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు
- విద్యా రంగంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
- అడ్డుకున్న పోలీసులు ∙ ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థుల అరెస్టులు
- పోలీసుల తీరు, అరెస్టులకు నిరసనగా నేడు విద్యా సంస్థల బంద్‌కు పిలుపు
సాక్షి నెట్‌వర్క్: విద్యారంగంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్లను ముట్టడించారు. అనుమతి లేని కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల విద్యార్థులు, ఆందోళనకారులు కలెక్టరేట్ల లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో ఆందోళనకారులను, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసుల వైఖరికి, అరెస్టులకు నిరసనగా గురువారం విద్యాసంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా..
బుధవారం ఉదయమే హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు మట్ట రాఘవేందర్ ఆరోపించారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తుంటే.. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం 30 యా క్ట్‌ను తెచ్చిందని మండిపడ్డారు. దానిని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లాలో కలెక్టరే ట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. హన్మకొండలో ని ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థు లు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపో యేందుకు ప్రయత్నించగా.. వారికి, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
బంగారు తెలంగాణ ఇదేనా?
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యం కారణంగా గ్రూప్–2, ఎస్సై, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందని ఆందోళనల సందర్భంగా విద్యార్థులు మండిపడ్డారు. కమిషన్ చైర్మన్ చక్రపాణిని పదవి నుంచి తొలగించాలని.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందని కారణంగా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు గుర్తింపు లేకుండా బ్రాంచిలను నడుపుతూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే విద్యార్థులు వర్షంలో తడుస్తూ ఆందోళనలు చేయడమేనా అని ప్రశ్నించారు.