బుధవారం అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఓ విద్యార్థినిని అదుపులోకి తీసుకుంటున్న మహిళా పోలీసులు
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోందంటూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులు ఇటీవల ఎన్నడూలేని విధంగా అసెంబ్లీ గేట్ నంబర్–2 వరకు పెద్దసంఖ్యలో రాగలిగారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లాల నుంచి ముందస్తు వ్యూహంతో బయలుదేరిన ఏబీవీపీ కార్యకర్తలు సాధారణ ప్రయాణికుల మాదిరిగా, గరిష్టంగా పది మంది చొప్పున ఆర్టీసీ బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించారు. జెండాలు ఎవరి కంటా పడకుండా వాహనాలు దిగే వరకు జేబుల్లోనే ఉంచుకున్నారు.
అసెంబ్లీ చుట్టూ ఉన్న తెలుగు యూనివర్సిటీ, నిజాం కళాశాల వైపుల నుంచి బస్సులు, ఆటోల ద్వారా వచ్చి.. రవీంద్రభారతి, ఆ చుట్టుపక్కల దిగారు. ఉదయం 11.20 కి ఒక్కసారిగా 1, 2 నంబర్ల అసెంబ్లీ గేట్ల వైపు దూసుకొచ్చారు. గేట్–2 వద్దకు చేరుకుని, ఎక్కేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వారిని కిందికి దింపే క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జీ చేశారు. గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించిన వారిని కిందకు లాగేశారు. లాఠీచార్జిలో రాష్ట్ర నాయకులు పృథ్వి సొమ్మసిల్లి పడిపోయాడని, నిహారిక, నరేంద్ర, మల్లికార్జున్‌ల చేతులకు తీవ్ర గాయాలయ్యాయని ఏబీవీపీ నాయకులు అంబాల కిరణ్, సుమన్‌శంకర్, రాఘవేంద్ర తెలిపారు.
ముట్టడిలో పాల్గొన్న ఏబీవీపీతో పాటు పీడీఎస్‌యూ నాయకులు 224 మందిని సైఫాబాద్ పోలీసులు అరెస్ట్‌చేసి నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలిం చారు. వీరిపై 151 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొందరు కార్యకర్తలపై నాన్–బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు వారికి నోటీసులిచ్చి విడిచిపెట్టారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, వర్సిటీలలో వైస్‌చాన్సలర్లను నియమించాలని, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్లతో ఏబీవీపీ ఈ కార్యక్రమం చేపట్టింది. పీడీఎస్‌యూకు చెందిన విద్యార్థి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: ఏబీవీపీ
విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. 24 గంటల్లోగా సీఎం కేసీఆర్ స్పందించి, లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే.. శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునివ్వడానికీ వెనుకాడబోమని హెచ్చరించింది. అరెస్ట్ చేసిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment