ఏబీవీపీ నాయకుల సంబరాలు
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఘన విజయం సాధించింది. 2018–19 విద్యా సంవత్సరానికి విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించగా ఓట్ల లెక్కింపును శనివారం చేపట్టారు. రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపులో ఏబీవీపీ, ఓబీసీఎఫ్, సేవాలాల్ విద్యార్థిదళ్ కూటమి అభ్యర్థులంతా ఘన విజయం సాధించాచినట్లు హెచ్‌సీయూ అధికారులు తెలిపారు. ఫలితాలు ప్రకటించగానే ఏబీవీపీ, ఓబీసీఎఫ్, సేవాలాల్ విద్యార్థి దళ్ కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు.
ప్రెసిడెంట్‌గా నాగ్‌పాల్ విజయం
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, హెచ్‌సీయూ విభాగం మహిళా కన్వీనర్, సైకాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆర్తి నాగ్‌పాల్ తన సమీప ప్రత్యర్థి ఎర్రం నవీన్‌కుమార్‌పై 334 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆర్తికి 1,663 ఓట్లు రాగా నవీన్‌కు 1,329 ఓట్లు మాత్రమే లభించాయి. ఉపాధ్యక్ష పదవికి పోటీచేసిన అమిత్ కుమార్ çతన సమీప ప్రత్యర్థి పి.పారితోశ్‌పై 247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అమిత్‌కు 1,505 ఓట్లు లభించగా పారితోశ్‌కు 1,258 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేసిన ధీరజ్ సంగోజి తన సమీపç ప్రత్యర్థి అభిషేక్‌కుమార్‌పై 127 ఓట్లతో విజయం సాధించారు. ధీరజ్‌కు 1,573 ఓట్లురాగా అభిషేక్‌కు 1,446 ఓట్లు లభించాయి. సంయుక్త కార్యదర్శి పదవికి పోటీచేసిన ఎస్. ప్రవీణ్‌కుమార్ తన సమీప ప్రత్యర్థి అనుమపెస్ కృష్ణన్‌పై 39 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.
సాంస్కృతిక కార్యదర్శి పదవికి పోటీచేసిన అరవింద్ ఎస్ కుమార్ తన ప్రక్రితి చక్రవర్తిపై 233 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అరవింద్‌కు 1,475 ఓట్లు రాగా చక్రవర్తికి 1,242 ఓట్లు పోల్ అయ్యాయి. క్రీడా కార్యదర్శి పదవికి పోటీ చేసిన కె. నిఖిల్‌రాజ్ తన సమీప ప్రత్యర్థి శ్యామ్యూల్ ఈను రాగ్ నాలామ్‌పై 139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిఖిల్‌కు 1,467ఓట్లు రాగా, శ్యామ్యూల్‌కు 1,328 ఓట్లు లభించాయి.
నోటాకు 983 ఓట్లు
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఆరు పదవులకే 983 ఓట్లు పోల్ కావడం విశేషం. అ«ధ్యక్ష పదవికి 95, ఉపాధ్యక్ష పదవికి 216, ప్రధాన కార్యదర్శికి 144, క్రీడా కార్యదర్శికి 199, సాంస్కృతిక కార్యదర్శికి 133, సంయుక్త కార్యదర్శికి 196 ఓట్లు పోల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment