కరీంనగర్ : కల్యాణలక్ష్మి పథకం కోసం వచ్చిన ఒక జంట వద్ద నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్‌కు చెందిన సీనియర్ అసిస్టెంట్ మల్లయ్య ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని సుభాష్‌నగర్‌కు చెందిన సుబేర్ అనే యువకుడు మతాంతర వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో కల్యాణలక్ష్మి పథకం కోసం వెల్ఫేర్ అధికారి మల్లయ్యను సంప్రదించారు. అయితే ఈ పథకం అమలు కోసం అతను రూ. 10వేలు డిమాండ్ చేశాడు. దీంతో సుబేర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం.. సుబేర్ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా మల్లయ్యను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.