అరెస్టుకు రంగం సిద్ధం..?
♦ మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసుల్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు
♦ బయటపడుతున్న భారీ ఆస్తులు
♦ హైదరాబాద్ కేంద్రంగా ఇటీవల దందా
♦ కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్లు
♦ పలువురిని విచారిస్తున్న ఏసీబీ బినామీల వేటలో పడిన అధికారులు
సాక్షి, కరీంనగర్/కరీంనగర్‌క్రైం: మాజీ ఏఎస్సై బొబ్బల మోహన్‌రెడ్డి అరెస్టుకు అవినీతి నిరోధకశాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్‌రెడ్డిని అరెస్టు చేసేం దుకు సిబ్బందిని రంగంలోకి దింపినట్లు సమాచారం. కొంతకాలంగా స్థబ్దుగా ఉన్న ఈ కేసు ఏసీబీ డీజీ మారడంతో మళ్లీ వేగం పుంజుకుంది. ఏకకాలంలో హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో మోహన్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఏసీబీ సోదాలు చేయడంతో కేసు తాజాగా మళ్లీ తెరపైకి వచ్చిం ది. నాడు పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి నుంచి పలు ఆధారాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికా రులు ఉన్నతాధికారుల ఆదేశాల మే రకు రెండ్రోజులుగా దాడులు చేస్తోంది.
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. శనివారం కూడా హైదరాబాద్‌తోపాటు మరోసారి కరీంనగర్‌లో కూడా ఆరా తీసింది. ఈ సందర్భంగా హైదారాబాద్‌లో పెద్దఎత్తున బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, తాజాగా ఏర్పాటు రియల్‌ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుందని సమాచారం. 2006లో ఒకసారి అక్రమాస్తుల కేసు నమోదైంది. ఈ కేసు తుది తీర్పు త్వరలోనే రానుందని తెలిసింది. తాజాగా మళ్లీ అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అరెస్టు చేసేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం.
హైదరాబాద్ కేంద్రంగా అడ్డా..
కరీంనగర్ కేంద్రంగా పలు దందాలు, కబ్జాలు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి పలువురు బినామీల పేరు మీద వందల కోట్ల ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో 48 కేసులు నమోదు కాగా.. వాటిలో 43 కేసులను సీఐడీ విచారించింది. వీటిలో పలు రకాలుగా ఆస్తుల సమాచారం సేకరించింది.
రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మోహన్‌రెడ్డి అతని బంధువులు, బినామీలకు సంబంధించిచి సుమారు 550 డాక్కుమెంట్లు స్వాధీనం చేసుకుంది. వాటిని విచారించి సుమారు వందల కోట్ల ఆస్తులున్నట్లు ప్రచారం జరిగింది. ఏకంగా అసెంబ్లీలో కూడా వందల కోట్ల ఆస్తులు మోహన్‌రెడ్డి కూడబెట్టాడని సభ్యులు ప్రస్తావించారు. అరెస్టు తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చిన ఆయన అక్కడ భారీగా ఆస్తులను కూడబెట్టారని తెలిసింది.
మోహన్‌రెడ్డి ఆయన కుటుంబసభ్యుల పేరుతో భవనాలు కొనుగోలు చేశారని, దీనిలో కరీంనగర్‌కు చెందిన ఓ న్యాయవాది బినామీగా వ్యవహరించారని తెలిసింది. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యుల పేరు మీద ఓ కన్సల్టెంట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అమ్మకాలు కూడా ఆ కన్సల్టెంట్ మీదుగానే నిర్వహించారని సమాచారం. మోహన్‌రెడ్డి బంధువులు కూడా హైదరాబాద్‌కు మకాం మార్చి అక్కడే మళ్లీ దందాకు తెరలేపారని తెలిసింది. శనివారం ఏసీబీ దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయని.. ఇవన్నీ కూడా కరీంనగర్‌లో బినామీలుగా వ్యవహరించిన వారి పేరు మీద ఉన్నట్లు తెలిసింది. గతంలోనే పలు బినామీలపై కేసులను నమోదు చేసిన పోలీసులు, సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు.
ఏసీబీ దాడులతో ఆసక్తికర విషయాలు..
మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి పోలీస్‌శాఖలోని సీఐడీలో ఏఎస్సైగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టాడని ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే.. నాడు కూడా అప్పులు ఇచ్చి భారీగా ఆస్తులను లాక్కున్నాడని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని పలువురిని మోసం చేశారని పలువురు బాధితులు ఆరోపించారు. వీటిలో ఇద్దరు బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడంతో రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చారు. అయినా.. తన తీరు మార్చుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
కరీంనగర్‌లో భారీగా ఆస్తులను కూడబెట్టిన మోహన్‌రెడ్డి వాటిని చాలా వరకూ తన బినామీలుగా పేర్కొంటున్న వారిపై ఉన్నట్లు తెలిసింది. దీంతోపాటు లీగల్‌గా తనకు ఎలాంటి సంబంధం లేనట్లు చెప్పుకొచ్చారు. అయితే.. ఈ మధ్యలోనే తన బినామీలుగా పేర్కొంటున్న బం«ధువులతోపాటు ఆయన మకాం హైదరాబాద్‌కు మార్చినట్లు తెలిసింది. అక్కడ కూడా తనదైన శైలిలో భారీగా భవనాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇటీవలే దీనిపై విచారణ చేపట్టిన అధికారులు శనివారం కూడా పలువురు బినామీలను విచారించడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసిన ఏసీబీ ఏకకాలంలో దాడులు చేయాలని చూస్తోందని సమాచారం.