చెన్నూర్/చెన్నూర్ రూరల్(జైపూర్), న్యూస్‌లైన్ : జైపూర్ మండలం ఇందారం గ్రామ వీఆర్వో వెన్నంపల్లి శంకరయ్య మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. అదే గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు తనుగుల శంకర్ రెండు నెలల క్రితం మెడికల్ అన్‌ఫిట్ అయ్యారు. ఆయన ఉద్యోగం పొందెందుకు సదరు కార్మికుని కుమారునికి డిపెండెంట్ సర్టిఫికెట్ అవసరం పడింది. ఈ సర్టిఫికెట్ కోసం శంకర్ కుమారుడు సతీశ్ రెండు నెలల క్రితం జైపూర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని వీఆర్వో వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో సతీశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ పథకం ప్రకారం సతీష్ వీఆర్వో శంకరయ్యకు రూ.5 వేలు ఇస్తుండగా పట్టుకున్నాడు.
సమాచారం ఇస్తే స్పందిస్తా..
అనినీతి అధికారులు వేధింపులకు గురి చేసినట్లయితే ఎవరైనా సమాచారం అందిస్తే స్పందిస్తామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో లంచంలు ఇవ్వాలని అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. నిర్భయంగా ప్రతి వ్యక్తి మమ్మల్ని ఆశ్రయించాలని పేర్కొన్నారు. తూర్పు జిల్లా నుంచి ఎక్కువ శాతం ఫిర్యాదుల అందుతున్నాయని తెలిపారు.ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణామూర్తి, వేణుగోపాల్, శ్రీనివాస్ రాజ్‌లు పాల్గొన్నారు.
నెలన్నరలో ముగ్గురు పట్టివేత
సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని లంచావతారాలకు ఏసీబీ అధికారులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కేవలం నెలన్నర వ్యవధిలోనే ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఇందుకు నిదర్శనం. ఏప్రిల్ 17న మంచిర్యాల పట్టణానికి చెందిన సహిర్ అనే వ్యక్తి చెన్నూరుకు చెందిన వీఆర్‌వో జమీర్‌అలీ ఏసీబీకి పట్టించారు. గృహనిర్మాణం కోసం తీసుకున్న స్థలానికి ధ్రువీకరణ పత్రం కోసం జమీర్‌అలీని సంప్రదించగా రూ.14 వేలు లంచం అడిగారు. ఇందులో రూ.4 వేలు అడ్వాన్స్‌గా సహిర్ ఇచ్చారు. మిగతా రూ.10వేలు ఇస్తేనే ప్రోసిడింగ్ ఇస్తానని వీఆర్వో జమీర్ అలీ స్పష్టం చేయడంతో సహిర్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు.
ఏప్రిల్ 17న చెన్నూర్ ఎమ్మార్వో కార్యాలయంలో రూ.10 వేలు ముట్టజెప్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈనెల 9న కిరణ్‌కుమార్ అనే జీఆర్పీ ఎస్సై ఏసీబీకి చిక్కారు. రైలు ప్రమాదంలో మరణించిన భర్త మరణ ధ్రువీకరణ పత్రం అందజేయాలని బాధితురాలు పబ్బతి సౌజన్య కిరణ్‌కుమార్‌కు విన్నవించారు. మొదట రూ.50వేలు డిమాండ్ చేసిన కిరణ్‌కుమార్ తర్వాత రూ.30 వేలు ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధపడ్డారు. రూ.30వేలు ఇస్తున్న సమయంలో రైల్వే స్టేషన్లోనే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. తాజాగా జైపూర్ మండలానికి ఇందారం వీఆర్వో శంకరయ్య అవినీతి నిరోధక శాఖకు చిక్కారు.
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
Published Wed, May 28 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement