
వేం నరేందర్ రెడ్డిని విడిచిపెట్టిన ఏసీబీ
ఓటుకు నోటు కేసులో ఏసీబీ వర్గాలు ముమ్మరంగా విచారించిన తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని విడిచిపెట్టారు. విచారణ అనంతరం ఆయన తిరిగి ఇంటికి వెళ్లారు. వాస్తవానికి దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగిన తర్వాత నేరుగా ఏసీబీ పోలీసులు వేం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తారని కూడా ఏసీబీ వర్గాల నుంచి సమాచారం అందింది. అయితే, తర్వాత పరిణామాలు నాటకీయంగా మారిపోయాయి. విచారణకు తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు హాజరవుతానని, అరెస్టు కాలేదని చెబుతూ, నివాసానికి చేరుకున్నారు. ఆయన మీడియాతో ఏమన్నారంటే...
''వాళ్లు అడిగిన వాటికి సమాధానాలు చెప్పాను, అరెస్టు కాలేదు. అలాంటిది ఏమీ లేదు. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాము. మేం ఎలాంటి తప్పు చేయలేదు. ఎప్పుడు పిలిచినా వాళ్లకు కావల్సిన సమాచారం ఇస్తామని చెప్పాము. వాళ్లు అడిగిన వాటికి స్పష్టంగా సమాధానాలు చెప్పాము. ఇన్వెస్టిగేషన్కు సహకరిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాము''.