ఏసీబీ వలలో మరో అధికారి | ACB Searches At Yadadri | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో మరో అధికారి

Published Thu, Aug 9 2018 2:38 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Searches At Yadadri - Sakshi

డీఈ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు,

సాక్షి, యాదాద్రి : ఏసీబీ అధికారుల వలకు మరో అధికారి చిక్కారు. భువనగిరి సబ్‌డివిజన్‌ పరిధిలోని టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ డీఈ దుర్గారావు ఆ సంస్థకు చెందిన కాంట్రాక్టర్‌ పారునంది భాస్కర్‌ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడడం యాదాద్రిభువనగిరి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 1న చౌటుప్పల్‌ గ్రామ పంచాయతీ ఇన్‌చార్జి సెక్రటరీ ఏసీబీకి పట్టుబడ్డ విషయం మరువక ముందే జిల్లాలో మరో అధి కారి ఏసీబీకి చిక్కడం గమనార్హం. 

ఎస్పీడీసీఎల్‌ డీఈ దుర్గారావు గతేడాది అక్టోబర్‌ 30న బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఈయన ఇక్కడ ఏడీఈగా కూడా పనిచేశారు. తమ శాఖలో చేపట్టే పనుల మంజూరు, బిల్లుల మం జూరుకు లంచాలు డిమాండ్‌ చేస్తున్నాడని కాం ట్రాక్టర్‌ భాస్కర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయిం చారు. హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌లోని గ్రీన్‌పార్క్‌కాలనీలోని తన నివాసంలో బుధవారం ఉదయం డీఈ రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీ బీ అధికారులు పట్టుకున్నారు.

ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు అదే సమయంలో భువనగిరిలోని డీఈ కార్యాలయంలో ఏసీబీ సీఐ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు డీఈ కా ర్యాలయంలో విచారణ చేపట్టారు. రాత్రి వరకు 6ఫైళ్లను పరిశీలించారు. మరికొన్నింటిని సీజ్‌ చేసి తమ వెంట తీసుకుపోయారు. ప్రధానంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు ఏ కారణం చేత ఆగిపోయాయన్న విషయంపై ప్రత్యేకంగా విచారణ ప్రారంభించారు. రాత్రి న్యూరాంనగర్‌లో డీఈ అద్దెకు ఉంటున్న ఇంటిని ఏసీబీ అధికారులు పరిశీలించారు. 

బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్‌

రాజాపేట మండలంలో నాటిన విద్యుత్‌ స్తంభాల బిల్లుల మంజూరు కోసం డీఈ కాంట్రాక్టర్‌ భాస్కర్‌ను రూ.50వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతోపాటు మార్చిలో చేసిన రూ.18లక్షల పనులకు ఏప్రిల్‌లో బిల్లులు మంజూరయ్యాయి. వా టికి సంబంధించి మూడు శాతం లంచం చొప్పున రూ.54వేలు గత నెల 30వ తేదీన భాస్కర్‌ డీఈకి చెల్లించారు. మరో 10 పనుల అగ్రిమెంట్, రూ.9 లక్షల పాత బిల్లుల మంజూరుకు లంచం డిమాం డ్‌ చేశారు.  

దీంతో భాస్కర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు ఇచ్చిన సూచనల మేరకు రూ.50వేల నగదును తీసుకుని కర్మన్‌ఘాట్‌లోని డీఈ ఇంటికి వెళ్లి ఆయన గదిలో ఆ మొత్తాన్ని డీఈకి అప్పగించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు సిబ్బందితో కలిసి డీఈ దుర్గారావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్‌ చేశారు.

గతంలో పట్టుబడ్డ విద్యుత్‌ అధికారులు

2008లో భువనగిరి రూరల్‌ ఏఈ వినోద్‌రెడ్డి, రా యగిరిలో ఏఎల్‌ఎం యాదగిరి రాయగిరి, చౌటుప్పల్‌లో అప్పటి ఏఈ శ్రీనివాస్‌ పట్టుబడ్డారు. నల్లగొండ ఎస్‌ఈ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఈ అశోక్‌కుమార్, రామన్నపేట ఏడీ కృష్ణయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 

కాంట్రాక్టుల వివాదమే కారణమా?

కాంట్రాక్టు పనుల కేటాయింపులో తలెత్తిన వివా దమే డీఈపై ఏసీబీ దాడులు చేసే వరకు వెళ్లిందని తెలుస్తోంది. లక్ష రూపాయలలోపు కాంట్రాక్టు పనులను నామినేషన్‌ పద్ధతిపై డీఈకి కేటాయించే అధికారం ఉంటుంది. ఈ సమయంలోనే అతను ఒక కాంట్రాక్టర్‌కు రూ.3కోట్ల పనులను అప్పగిం చడం వల్లే మరో కాంట్రాక్టర్‌ అయిన భాస్కర్‌కు ఆగ్రహం కలిగించిందని విద్యుత్‌ శాఖలో చర్చ జరుగుతోంది. గతంలో ఏడీఈగా పని చేసిన దుర్గారావు ఏడాది క్రితం బదిలీపై వికారాబాద్‌ నుంచి ఇక్కడికి వచ్చారు.

అయితే డీఈ తమ శాఖ కు సంబంధించిన పనుల కేటాయింపులో వివక్ష చూపుతున్నాడని కాంట్రాక్టర్‌ భాస్కర్‌ ఆగ్రహం పెంచుకున్నట్లు తెలుస్తోంది. 20ఏళ్లుగా ఈప్రాం తంలో ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న తనను కాదని మరో కాంట్రాక్టర్‌కు డీఈ అధికంగా పనులు నామినేషన్‌పై కేటాయిస్తున్నాడన్న కారణంతోనే ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement