‘వసతి’లేని గృహాలు | 'Accommodation' homes | Sakshi
Sakshi News home page

‘వసతి’లేని గృహాలు

Published Wed, Jul 16 2014 3:45 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

‘వసతి’లేని గృహాలు - Sakshi

‘వసతి’లేని గృహాలు

 సాక్షిప్రతినిధి, నల్లగొండ :నల్లగొండ పట్టణంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ముద్దన్నం, నీళ్లచారు అందుతున్నాయి. బీసీ హాస్టల్ విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లు, పెట్టెలు అందలేదు.  పట్టణంలోని బీసీ, ఎస్సీ హాస్టల్స్‌లో టాయిటెట్లకు తలుపులు లేవు. 1500మంది విద్యార్థులున్నా ఎస్సీ బాలుర హాస్టల్‌లో టాయిలెట్ల సమస్య ఉంది. తిప్పర్తిలోని బీసీ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు నేటి వరకూ నోట్‌బుక్స్, డ్రస్సులు, బెడ్‌షీట్లు ఇవ్వలేదు. అలాగే ఎస్టీ బాలికల, ఎస్టీ బాలుర వసతి గృహాల విద్యార్థులకు డ్రస్సులు ఇంతవరకు రాలేదు. బీసీ బాలుర వసతిగృహం అద్దె భవనంలో కొనసాగుతుంది. కనగల్‌లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు దుస్తులు సరఫరా కాక, చిరిగిన బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇన్‌చార్జి వార్డెన్ స్థానికంగా ఉండకపోవడంతో సమస్యలు తప్పడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
   భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి, వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లోని వసతి గృహాల్లో విద్యార్థుల కొరత తీవ్రంగా ఉంది. డివిజన్‌లో1400సీట్లు ఉండగా 600 మందికి మించి విద్యార్థులు లేరు. భువనగిరిలో ఎస్సీ బాలుర, ఎస్సీ కళాశాల వసతి గృహంలో మంచినీటి సౌకర్యం, వసతి సరిగా లేవు. బీబీనగర్, పోచంపల్లిలో బాలికల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పోచంపల్లి హాస్టల్ భవనం చుట్టూ ప్రహరీ లేక విద్యార్థులు రాత్రివేళల్లో భయాందోళనకు గురవుతున్నారు. బీబీనగర్ బాలుర హాస్టల్‌లోని మరుగుదొడ్లలో ట్యాప్‌లు పనిచేయకపోవడంతో విద్యార్థులు బయట స్నానాలు చేస్తున్నారు.  
   మిర్యాలగూడ పట్టణ పరిధిలోని షాబునగర్ ఎస్సీ బాలుర హాస్టల్ (ఆనంద నిలయం)లో మరుగుదొడ్లకు డోర్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  
 
 వర్షాలు వస్తే  ఎస్సీ(బీ) బాలికల హాస్టల్ గదుల్లోకి జల్లులు కొడుతున్నాయి. ఎస్టీ బాలికల హాస్టల్‌లో ఉదయం టిఫిన్ వేళలో వర్షంలోనే విద్యార్థులు క్యూలో నిల్చున్నారు. ఎస్సీ బాలికల వసతి గృహంలో బాత్‌రూములకు తలుపులేవు. ఈదులగూడలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో గదుల తలుపులకు చెక్కబల్లను అడ్డం పెట్టుకుంటున్నారు. దామరచర్ల మం డలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. బాత్‌రూములు లేక విద్యార్థులు ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు.  చౌటుప్పల్‌లోని ఎస్సీ బాలుర వసతిగృహంలో 60మంది విద్యార్థులకు 12మంది మాత్రమే ఉన్నారు.  మెనూ అమలు కావడంలేదు. నేలపట్ల గ్రామంలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తుండడంతో అందుబాటులో లేరు. నల్లగొండ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చండూరులోని ఎస్సీ హాస్టల్ అద్దెభవనంలో కొనసాగుతోంది.  మర్రిగూడలోని ఎస్సీ హాస్టల్ మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు.
 
   కోదాడ నియోజకవర్గంలోని 16 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అసౌకర్యాల మధ్య కునారిల్లుతున్నాయి. 16మంది వార్డెన్లూ  కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. మోతెలోని బీసీ బాలుర వసతి గృహంలో 68 మంది విద్యార్థులకు గాను 12మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. గణపవరం, కాపుగల్లు హాస్టళ్లు విద్యార్థులు లేక సరిగా నడవడం లేదు. మునగాల ఎస్సీ బాలికల కోసం రూ.50 లక్షలతో నిర్మించిన పక్కా భవనానికి విద్యుత్ సౌకర్యం లేక నిరుపయోగంగా పడి ఉంది. నడిగూడెం మండలంలో బాలుర వసతిగృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు.  
 
   తుంగతుర్తి నియోజకవర్గంలోని 22ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో 13 అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాలు ఉన్నచోట అవి శిథిలావస్థకు చేరాయి. తుంగతుర్తిలోని సంక్షేమ వసతి గృహాలకు మంచినీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహాల్లో 10చోట్ల ఇన్‌ఛార్జి వార్డెన్‌లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వాచ్‌మన్‌లు, వంటమనుషులు లేక హాస్టల్స్‌కు భద్రత కరువైంది.    పెద్దఅడిశర్లపల్లి మండలం గుడిపల్లి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో గత ఏడాది 90 మంది విద్యార్థులున్నా, వసతిగృహం తెరుచుకోకపోవడంతో విద్యార్థులు తిరిగి ఇంటికే పరిమితమయ్యారు. డిండి మండలంలోని ఎస్సీ హాస్టల్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దేవరకొండ పట్టణంలోని ఏ1, ఏ2 హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తుండడం, అవి కూడా పాతభవానాలు కావడంతో వర్షాలు కురిస్తే విద్యార్థులు ఉండే పరిస్థితి లేదు. కొండమల్లేపల్లిలోని ఏ3 హాస్టల్ కూడా అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు.
 
 ఈ హాస్టల్‌లో కూడా అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో పెట్టెలు, ప్లేట్లు ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు.   సూర్యాపేట నియోజకవర్గంలో పట్టణంలో 19, మండలాల పరిధిలో 17 హాస్టళ్లు ఉన్నాయి. పట్టణం లో 19 హాస్టళ్లకు గాను 17 హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. పట్టణంలోని ఎస్సీ బాలుర-బీ హాస్టల్‌లో భవనంపై కప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. ఏ సమయంలో అవి కూలిపోతాయోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. జేజేనగర్ బాలికల కళాశాల హాస్టల్, హనుమాన్‌నగర్ ఎస్టీ బాలికల హాస్టల్‌లో స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులు బిగించకుండా వదిలేశారు. గిరి జన బాలికల హాస్టల్‌లో విద్యుత్‌వైర్లు తేలి ప్రమాదకరంగా మారాయి.
 
   నకిరేకల్ నియోజకవర్గంలో మొత్తం 15 ప్రభు త్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఐదింటికి మాత్రమే పక్కా భవనాలు  నిర్మించారు. మిగతా 10 వసతిగృహాలు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. నాణ్యమైన బియ్యం సరఫరా కాకపోవడంతో భోజనం ము ద్దలు ముద్దలుగా ఉండడంతో విద్యార్థులు తినలేని పరిస్థితి ఉంది.  కట్టంగూర్‌లోని ఎస్సీ హాస్టల్ అద్దె భవనం వర్షం వస్తే కురుస్తుంది. మరుగుదొడ్లు కూడా సరిపోవడం లేదు. చిట్యాలలోని ఎస్సీ హాస్టల్ ఇరుకు గదులలో కొనసాగుతుంది. నార్కట్‌పల్లి మండలంలో రెండు ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులకు సరిపోను స్నానాల గదులు, మరుగుదొడ్లు లేవు. రామన్నపేట మండలంలోని ఎస్సీ హాస్టల్‌లో వర్షం వస్తే జలమయమవుతుంది. కేతేపల్లిలోని ఎస్సీ హాస్టల్ పక్కా భవనం ఉన్నా మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి.
 
   నాగార్జునసాగర్ నియోజకవర్గవ్యాప్తంగా 25 ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. గుర్రంపోడు మండలకేంద్రంలోని బీసీ హాస్టల్, పెద్దవూర మం డల కేంద్రంలోని ఎస్టీ స్పెషల్ హాస్టల్, ఎస్సీ హాస్టల్, త్రిపురారంలోని బీసీ బాలుర, ఎస్సీ బాలు ర, నిడమనూరు మండలంలో ఎస్సీ, బీసీ  బాలుర వసతి గృహాలు అద్దె భవనంలో నడుస్తున్నాయి. ఇక్కడ కనీస సదుపాయాలు లేవు. తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పెద్దవూర ఎస్టీ స్పెషల్ హాస్టల్‌లో కృష్ణావాటర్ వస్తేనే నీరు.. లేకుంటే స్నానాలు చేసేందుకు వాగును ఆశ్రయిస్తున్నారు. త్రిపురారం మండలంలో బీసీ, ఎస్సీ బాలు ర వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేవు.  
 
   హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 15 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. హు జూర్‌నగర్‌లోని  కొందరు వార్డెన్లు స్థానికంగా నివా సం ఉండకుండా అప్పుడప్పుడు హాస్టళ్లకు వచ్చి వెళుతున్నారు. హుజూర్‌నగర్‌లోని ఎస్సీ, ఎస్సీ ఏ-1, బీసీ బాలుర, నేరేడుచర్లలోని ఎస్సీ హాస్టళ్ల్లు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెనూ అమలుకావడం లేదు. అరటిపండు, కోడిగుడ్డు సరఫరాలో కోతలు పెడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. హుజూర్‌నగర్‌లోని ఎస్టీ బాలుర హాస్టల్‌లో ఉద యం టిఫిన్‌కు బదులు భోజనం వండి వడ్డిస్తున్నారు.   ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్.ఎం, గుండాల, రాజాపేట, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో సంక్షేమ హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి వసతి గృహంలో 10 మందికి మించి విద్యార్థులు ఉండడంలేదు. గుండాల మండలం సీతారాం పురంలో అద్దెభవనంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement