చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలి
సీపీఎం రాష్ట్ర ప్లీనం డిమాండ్
హైదరాబాద్: రాష్ర్టంలో చేపట్టే ప్రాజెక్టులకు 2013 చట్టానికి అనుగుణంగానే భూసేకరణ జరుపుతామంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర ప్లీనం డిమాండ్ చేసింది. వ్యవసాయ కార్మికులు, రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యతిరేకమనే ముద్ర ప్రజల్లో పడకముందే ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళితే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించింది. ముచ్చర్ల ఫార్మాసిటీ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 45పై హైకోర్టు స్టే ఇవ్వడం హర్షణీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. భూసేకరణ చట్టం పరిహార ప్యాకేజీని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. బుధవారం పార్టీ నేతలు బి.వెంకట్, హైమావతి, టి.సాగర్, జె.వెంకటేశ్‌లతో కలసి ప్లీనంలో చేసిన తీర్మానాలను ఆయన మీడియాకు విడుదల చేశారు.
సీఎంలకు తెలియకుండా
జరుగుతుందా?
గతంలోని సీఎంలతో పాటు, ప్రస్తుత సీఎంకు తెలియకుండా నయీమ్ వ్యవహారం సాగిందనుకుంటే పొరపాటేనని తమ్మినేని వ్యాఖ్యానించారు. వందల కోట్ల వ్యవహారాలు, కిరాతక హత్యలు, మంత్రులు, ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయం వంటివి సీఎంలకు తెలియకుండా ఉండదన్నారు. నయీమ్ కేసు ఆషామాషీది కాదని, న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలోనే ఈ కేసు దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని నియంత్రించాలని ప్లీనం డిమాండ్ చేసింది. ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వచ్చేనెల 2న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతునిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది.