వివాహితపై యాసిడ్ దాడి
ఖమ్మం: వివాహితపై యాసిడ్ దాడి జరిగిన సంఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటన కల్లూరు మండలం పెద్దకోరుకొండి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శీలం కృష్ణకుమారి(35)కి పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో.. పుట్టింటికి వచ్చేసింది. తల్లితో కలిసి కూలి పనులు చేసుకుంటూ తన కొడుకును సాదుకుంటోంది.
ఈ క్రమంలో గురువారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.