సాక్షి, హైదరాబాద్: బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న అంబేద్కర్ వాదుల మహాగర్జనలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో కేసీఆర్‌ను మించిన నియంత లేడని, అంబేద్కర్ కాలి గోటికి కూడా ఆయన సరిపోరని విమర్శించారు. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఎటు పోయిండు అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు అంబేద్కర్ గురించి మాట్లాడం లేదని నిలదీశారు. రాజ్యాంగంపై గౌరవం లేదు కానీ దేశానికి ప్రధానమంత్రి అవుతానని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ కలుస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను కేసీఆర్ అణిచివేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతను కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగoలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా నిర్వహిస్తున్న ఈ మహాగర్జనలో మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరాం, వీహెచ్ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, చాడ వెంకటరెడ్డి, ఎల్ రమణ, విమలక్క, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment