maha garjana
-
కేసీఆర్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది: అద్దంకి
సాక్షి, హైదరాబాద్: బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న అంబేద్కర్ వాదుల మహాగర్జనలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో కేసీఆర్‌ను మించిన నియంత లేడని, అంబేద్కర్ కాలి గోటికి కూడా ఆయన సరిపోరని విమర్శించారు. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఎటు పోయిండు అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు అంబేద్కర్ గురించి మాట్లాడం లేదని నిలదీశారు. రాజ్యాంగంపై గౌరవం లేదు కానీ దేశానికి ప్రధానమంత్రి అవుతానని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ కలుస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేసీఆర్ అణిచివేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతను కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగoలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా నిర్వహిస్తున్న ఈ మహాగర్జనలో మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరాం, వీహెచ్ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, చాడ వెంకటరెడ్డి, ఎల్ రమణ, విమలక్క, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
‘నాలుగేళ్లలో 2.49 లక్షల కోట్ల రూపాయల అప్పు’
సాక్షి, విజయవాడ: నాలుగేళ్లలో 2 లక్షల 49 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. సెప్టెంబర్ 15న విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించనున్ననూతన ప్రత్యామ్నాయ మహా గర్జన సభకు సంబంధించిన ప్రచార గీతమాలికను సోమవారం ఆయన అవిష్కరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ కార్యవర్గసభ్యులు శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సెప్టెంబర్ 15న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ మహా గర్జనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలపునిచ్చారు. ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం అనేక సదస్సులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. రాయలసీమ వెనుకబాటుతనం, అక్కడి కరువు పరిస్థితులపై మంగళవారం వైఎస్సార్ జిల్లాలో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడువి కేవలం ప్రచార ఆర్భాటలు మాత్రమేనని.. వాటి ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజధానిని నిర్మించకుండా ముంబై వెళ్లి బాండ్లను విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాజధానిలో సెంట్ భూమి కొనుక్కొని, ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యనించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. మార్చురీలో పోస్టుమార్టంకు కూడా డబ్బులు వసూలు చేసేంతలా అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి విలయం తాండవం చేస్తుంటే.. చంద్రబాబు డ్యాష్ బోర్డులో అది కనబడకపోవడం సిగ్గుచేటన్నారు. అది జ్ఞాన భేరి ఎలా అవుతుంది.. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధర్మ పాలన చేస్తూ ధర్మ పోరాటం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వేలాది ఎకరాల భూములు లాక్కొని ఒక్క పరిశ్రమైనా నిర్మించారా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు చేసేది నిజమైన పోరాటం కాదని అన్నారు. ప్రశ్నించే హక్కు లేకుండా విద్యార్థులను అరెస్ట్ చేస్తే అది జ్ఞాన భేరి ఎలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. ముంబై వెళ్లి బాండ్ల లిస్టింగ్పైన చూపే శ్రద్ద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీద పెట్టాలని సూచించారు. -
నరేంద్ర మోడీ 'మహాగర్జన'
-
నరేంద్ర మోడీ 'మహాగర్జన'
ముంబై:మోడీ మళ్లీ గర్జించారు. ముంబై శివార్లలోని బాంద్రా ప్రాంతంలో నిర్వహించిన 'మహాగర్జన'లో ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. గుజరాత్లో 365 రోజులూ, రోజుకు 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉంటుందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దాని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ సభకు ప్రత్యేకంగా పదివేల మంది చాయ్‌వాలాలను బీజేపీ ఆహ్వానించింది. ర్యాలీ ప్రారంభం కావడానికి ముందు మోడీ మైనపు విగ్రహాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు కారణం ఇక్కడి చరిత్రో.. లేక భౌగోళిక పరిస్థితులో కాదని, కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలేనని మోడీ మండపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఒకప్పుడు జబ్బుపడిన రాష్ట్రంగా ఉండి, ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధిబాటలో పయనిస్తోందని ఆయన అన్నారు. మైనారిటీయిజం, కమ్యూనలిజం (కులతత్వం) లాంటివి కాంగ్రెస్ సంప్రదాయాలని విరుచుకుపడ్డారు. అసలు ఉద్యోగాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి విధానమన్నదే లేదని విమర్శించారు. ఈ ప్రపంచంలో అవకాశం అంటూ ఇస్తే కేవలం యువత మాత్రమే అద్భుతాలు సృష్టించగలరని ఆయన అన్నారు. నిరుద్యోగంపై పోరాటం చేసి తీరాలని చెప్పారు. ''కాంగ్రెస్ మిత్రులారా వినండి.. టీవీలో మోడీ కనిపించినా కనిపించకపోయినా ఆయన దేశవాసుల హృదయాల్లో ఉన్నాడు'' అని చెప్పారు. ' ఏ బీజేపీ నేతకు స్విస్ బ్యాంక్ ల్లో నల్లధనం లేదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలి' 'నల్లధనం గురించి మాట్లాడుతున్న నేతలకు ఏమైనా ధైర్యం ఉంటే చట్ట పరిధిలో ఓ కమిటీని ఏర్పాటు చేయలి'. 'ఢిల్లీ అవినీతి గురించి ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ పెద్దలు.. ముంబై ఆదర్శ్ కుంభ కోణంలో చిక్కుకున్న మంత్రులను రక్షిస్తున్నారు'. -
22న బీజేపీ ‘మహా గర్జన’
ముంబై: రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 22న ముంబైలో ‘మహా గర్జన’ ర్యాలీ నిర్వహించనున్నామని పార్టీ అధికారి ఒకరు శనివారం తెలిపారు. ఈ మెగా ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, నాయకులు గోపీనాథ్ ముండే, ఏక్నాథ్ ఖడ్సే, వినోద్ తావ్డేతో పాటు పలువరు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. ఈ ర్యాలీ సన్నద్ధత ఏర్పాట్ల గురించి రాష్ట్ర బీజేపీ ఆఫీస్ బేరర్లతో పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ చర్చలు జరిపారు. ఇతర బహిరంగ సభల కన్నా అందరికీ ఆదర్శంగా నిలిచేలా ర్యాలీ ఏర్పాట్లు ఉండాలని, ఇందుకోసం అదనపు చర్యలు తీసుకోవాలని ఆఫీస్ బేరర్లందరిని కోరామని రూడీ చెప్పారు. ఈ ర్యాలీకి గ్రామీణ ప్రజలు హాజరయ్యేలా చూడాలని, ఈ మేరకు కిందిస్థాయి కార్యకర్తలు పాటుపడాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవీంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత మేర ఎక్కువ హాజరయ్యేందుకోసం వివిధ మీడియా సాధనాల ద్వారా ప్రచారం చేయాలని నగర పార్టీ అధ్యక్షుడు అశీష్ శెలార్ కోరారు. ర్యాలీ వేదిక ఎక్కడుంటుందనే తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.