నరేంద్ర మోడీ 'మహాగర్జన'
ముంబై:మోడీ మళ్లీ గర్జించారు. ముంబై శివార్లలోని బాంద్రా ప్రాంతంలో నిర్వహించిన 'మహాగర్జన'లో ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. గుజరాత్లో 365 రోజులూ, రోజుకు 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉంటుందని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దాని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ సభకు ప్రత్యేకంగా పదివేల మంది చాయ్వాలాలను బీజేపీ ఆహ్వానించింది. ర్యాలీ ప్రారంభం కావడానికి ముందు మోడీ మైనపు విగ్రహాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు కారణం ఇక్కడి చరిత్రో.. లేక భౌగోళిక పరిస్థితులో కాదని, కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలేనని మోడీ మండపడ్డారు. మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఒకప్పుడు జబ్బుపడిన రాష్ట్రంగా ఉండి, ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధిబాటలో పయనిస్తోందని ఆయన అన్నారు.
మైనారిటీయిజం, కమ్యూనలిజం (కులతత్వం) లాంటివి కాంగ్రెస్ సంప్రదాయాలని విరుచుకుపడ్డారు. అసలు ఉద్యోగాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి విధానమన్నదే లేదని విమర్శించారు. ఈ ప్రపంచంలో అవకాశం అంటూ ఇస్తే కేవలం యువత మాత్రమే అద్భుతాలు సృష్టించగలరని ఆయన అన్నారు. నిరుద్యోగంపై పోరాటం చేసి తీరాలని చెప్పారు.
''కాంగ్రెస్ మిత్రులారా వినండి.. టీవీలో మోడీ కనిపించినా కనిపించకపోయినా ఆయన దేశవాసుల హృదయాల్లో ఉన్నాడు'' అని చెప్పారు.
' ఏ బీజేపీ నేతకు స్విస్ బ్యాంక్ ల్లో నల్లధనం లేదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాలి'
'నల్లధనం గురించి మాట్లాడుతున్న నేతలకు ఏమైనా ధైర్యం ఉంటే చట్ట పరిధిలో ఓ కమిటీని ఏర్పాటు చేయలి'.
'ఢిల్లీ అవినీతి గురించి ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ పెద్దలు.. ముంబై ఆదర్శ్ కుంభ కోణంలో చిక్కుకున్న మంత్రులను రక్షిస్తున్నారు'.