సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి చరిత్రాత్మక విజయం నేపథ్యంలో బీజేపీలోకి వలసల పర్వం మొదలైంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్ల విషయంలో బీజేపీకి తలబొప్పికట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇప్పటి నుంచే ఆందోళనకు గురిచేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకుగాను 42 స్థానాలను మహాకూటమి గెలుచుకుంది. కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకులతోపాటు దిగ్గజాలను బరిలో దింపింది. అయితే నరేంద్ర మోడీ సునామీలో ఇతర పార్టీల ఎత్తులు, హామీలు కొట్టుకుపోయాయి. ఫలితంగా ఇరుపార్టీలు కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ 42 లోక్‌సభ స్థానాల పరిధిలోకి 240 శాసనసభ స్థానాలు వస్తాయి.
ఈ నియోజక వర్గాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ అభ్యర్థులకు అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి, దీంతో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆ రెండు పార్టీలకు చెందిన ఔత్సాహిక అభ్యర్థులు ఆందోళనలో పడిపోయారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల శాతాన్ని బట్టిచూస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తక్కువ శాతం ఓట్లు పోలవుతాయని భావిస్తున్నారు. దీంతో ఓటమి తథ్యమని ఇప్పటికే కొందరు ఓ నిర్ణయానికి వస్తున్నారు. దీంతో పార్టీలో తమ పరిస్థితి ఏమిటనే అంశంపై దిగులు పట్టుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పార్టీని వీడే యోచనలో ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే కొందరు మహాకూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఇలా ఇతర పార్టీల నుంచి వలసలు వస్తుండడం దశాబ్దాలనుంచి బీజేపీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలకు మింగుడు పడడంలేదు. గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. దీంతో శివసేన, బీజేపీ నాయకులకు పదవులు దక్కలేదు. వీరంతా కేవలం పార్టీ పటిష్టతకోసమే కృషి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. దీంతో అనేక మంది ఎమ్మెల్యే, ఇతర పదవులను ఆశిస్తున్నారు.
అయితే ఓటమిని ముందే గ్రహించిన కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి చెందిన కొందరు న కొందరు మహాకూటమిలో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొందరు బీజేపీ, శివసేన నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ అదే జరిగితే వారికి కూడా ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు తలెత్తితే తాము అన్యాయమైపోతామని ఆందోళన చెందుతున్నారు.
మున్ముందు బీజేపీకి తలబొప్పికట్టేనేమో!
Published Fri, May 23 2014 10:43 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement