- టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా కుట్రలు పన్నిన బాబు అవి ఫలించకపోవడంతో ఇపుడు అభివృద్ధికి మోకాలొడ్డుతున్నారని దుయ్యబట్టారు. అరవై ఏళ్లలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను, కేవలం ఏడు నెలల వయస్సున్న ప్రభుత్వం పరిష్కరించే దిశలో పయనిస్తోందని వారు పేర్కొన్నారు.
శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సవాలు చేస్తున్న టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో చర్చకు మంత్రి హరీష్‌రావు అక్కర్లేదని, ఎమ్మెల్యేలమైనా తాము చాలని గువ్వల బాలరాజు అన్నారు.
చంద్రబాబు వద్ద ఊడిగం చేస్తున్న తెలంగాణ టీడీపీ నేతలు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమేనని, చర్చకు చంద్రబాబును తీసుకురమ్మని ఎమ్మెల్యే వేముల వీరేశం సవాలు విసిరారు.