
ఆస్పత్రిలో తాళం వేసి ఉన్న మరుగుదొడ్లు
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) సమస్యల వలయంలో చిక్కుకుంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ వైద్యం, సదుపాయాలు సమకూర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. రిమ్స్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్న వైద్యులు సమయ పాలన పాటించడంలేదు. ప్రసూతి వార్డుల్లో రోగుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాల్సిన అభివృద్ధి కమిటీ సమావేశం ఆగస్టు నుంచి ఆఊసేలేదు. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆదేశాల మేరకు శనివారం రిమ్స్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగురామన్న, రాష్ట్ర దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గొడం నగేష్, జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, జెడ్పీ చైర్‌పర్సన్ శోభరాణి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్‌లో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
కనీస సౌకర్యాలు కరువు..
రిమ్స్ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 500 పడకల ఆస్పత్రి, నిత్యం 1500 మంది రోగులు వచ్చే రిమ్స్‌లో తాగునీటి కష్టాలు ఉండడం గమనార్హం. మరుగుదొడ్లకు నీటి సరఫరా లేక అపరిశుభ్రంగా మారడం, లేదంటే తాళాలు వేస్తున్నారు. ఆస్పత్రికి 4 లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా ప్రస్తుతం 2 లక్షల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్ తెప్పించుకుంటున్నా అవి సరిపోవడం లేదు. కనీసం ఏ ఒక్క వార్డులో కూడా తాగునీటి కులాయిలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడంతస్తుల్లో ఉన్న రోగులు నిత్యం నీటి కోసం కిందకు రావాల్సిందే. అది కూడా రిమ్స్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన తాగునీరే దిక్కవుతోంది. నీటి సరఫరాల లేక కొన్ని సందర్భాల్లో ఆపరేషన్‌లు నిలిచిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రిమ్స్‌తో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీటి కొరత ఏర్పడుతుంది. ఈ రెండింటికి కలిపి సుమారు 10 లక్షల నీటి అవసరం ఉంటుంది. గతంలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో తలమడుగు మండలంలోని మత్తడివాగు నుంచి పైప్‌లైన్ ద్వారా రిమ్స్‌కు నీటి సరఫరాచేయాలనే ప్రతిపాదనలు పెట్టారు. కానీ దానిపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశంలోనైనా తాగునీటి సమస్య పరిష్కారంపై ఒక స్పష్టత వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.
పెరిగిపోతున్న రెఫర్‌లు...
రిమ్స్‌కు వచ్చే అత్యవసర కేసులు దాదాపు 80శాతం ఇతర ప్రాంతాలకే రెఫర్ చేస్తున్నారు. చిన్నచిన్న కేసులు సైతం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రి పూర్తి చేస్తే రెఫర్ కేసులు తగ్గడంతో పాటు మరణాలు తగ్గిపోయి, అత్యవసర సమయంలో రోగులకు వైద్యం అందుతుంది. అయితే సూపర్ స్పెషాలిటీ పూర్తి కావడానికి కనీసం మరో మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు రిమ్స్‌లో రెఫర్ కేసులు, మరణాల పరిస్థితి ఇలాగే కొనసాగడం తప్పదనే చెప్పవచ్చు. దీనిపై మంత్రులు, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment