సాక్షి, వైరా: సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా వివాదాస్పద పోస్టులు చేస్తామంటే ఇకచెల్లదు. నా గ్రూపుల్లో నేను ఏ సమాచారం షేర్ చేస్తే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించకతప్పదు. అత్యుత్సాహంతో పోస్టులు పెట్టి, అవాకులు చెవాకులు పేలే వారికి శిక్ష తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూపులు అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లోకసభ ఎన్నికల షెడ్యూల్ రావడంతోనే జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్నీ పార్టీలకు చెందిన ఆశావాహులు టికెట్లు వచ్చేలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
ఓటర్లను ప్రసన్నం చేసుకునే ట్రెండ్‌లో సోషల్ మీడియా కీలకంగా మారింది. ఆశావాహులు సామాజిక మాధ్యమాల ద్వారానే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల వేళ అభ్యర్థుల హామీలు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై చేసే విమర్శలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల సందడి కనిపిస్తుంది. అభ్యర్థులు, పార్టీలు ఇలాంటి పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ పోస్టులు పెట్టిన గ్రూప్ అడ్మిన్‌పై చట్టప్రకారం కేసులు నమోదవుతాయి. ఎన్నికల వేళ ప్రత్యేకంగా ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సందేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభ్యంతరకర పోస్టులపై ఫిర్యాదులు వస్తే కేసులు పెడతామని అధికారులంటున్నారు.
అధికారుల ప్రత్యేక దృష్టి
సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు ఎక్కువగా సాగుతుండటంతో అ«ధికారుల సైతం ఈ పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించారు. అశ్లీల సమాచారం. ఫొటో మార్ఫింగ్ తప్పుడు సమాచారం, ఇతరులు మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేసేవారు. జైలు శిక్ష, జరిమానా అనుభవించాల్సి ఉంటుంది. అదే నేరానికి రెండోసారి పాల్పడితే పదేళ్లు జైలు, రూ.2లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలుంటాయి. పోస్టులు పెట్టే అడ్మిన్‌లతో పాటు వాటిని షేర్ చేసేవారిని కూడా బాధ్యులను చేసే అవకాశం ఉంటుంది.
అడ్మిన్‌లే బాధ్యులు
సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు చట్ట ప్రకారం ఆయా గ్రూపులకు సంబంధించిన అడ్మిన్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అపరిచితులను గ్రూప్‌లో చేర్చుకోకపోవడమే ఉత్తమం. వివాదాస్పదపోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారనే విషయాన్ని అడ్మిన్‌లతోపాటు గ్రూపూలలోని సభ్యులూ తెలుసుకుని మసలుకోవాలి. విద్వేషాలు రెచ్చ గొట్టే విషయాలు, తప్పుడు, తెలియని సమాచారం, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, ఓ వర్గాన్ని బాధించే ఏ విషయాన్ని పోస్టు చేయకపోడమే మంచిది.
అడ్మిన్లు జాగ్రత్త వహించాలి
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో ఇబ్బందికర పోస్టులు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇతర వ్యక్తులను, పార్టీలను ఇబ్బందులకు గురిచేసేలా ఎటువంటి పోస్టులు చేయకూడదు. అలా పోస్ట్ చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు కూడా ఉంటాయి.
–ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, వైరా
Comments
Please login to add a commentAdd a comment