Adminstration
-
Hyderabad: అదనపు డీజీ అయినా నో చాన్స్!
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 15, జనవరి 26న దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా వందనం ఉంటుంది. సంబంధిత కార్యాలయ అధిపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అదనపు డీజీ స్థాయిలో ఉండే నగర పోలీసు కమిషనర్‌కు మాత్రం ఆ చాన్స్ ఉండదు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు మాత్రం అప్పుడప్పుడు అవకాశం చిక్కుతుంటుంది. నగర కొత్వాల్‌కు ఉండే కీలకమైన బాధ్యతే అందుకు కారణం. ► హైదరాబాద్ కమిషనరేట్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఏడీజీ) స్థాయి అధికారి, సైబరాబాద్, రాచకొండలకు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్థాయి అధికారి కమిషనర్లుగా ఉంటారు. ప్రస్తుతం మాత్రం ఆ రెండు కమిషనరేట్లకూ ఏడీజీలే కమిషనర్లుగా ఉన్నారు. ► రాష్ట్ర డీజీపీకి సైతం లేని విధంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సహా వివిధ ప్రత్యేక అధికారాలు ఈ ముగ్గురు కమిషనర్లకూ ఉంటాయి. కీలక హోదా కలిగిన ఈ ముగ్గురికీ జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. మిగిలిన ఇద్దరికీ అప్పుడప్పుడూ ఆ చాన్స్ దొరుకుతుంది. ► జీహెచ్ఎంసీలో ప్రధాన కమిషనర్, కలెక్టరేట్లలో కలెక్టర్లు, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు, జలమండలిలో దాని ఎండీ.. ఇలా వాటి అధిపతులే జాతీయ జెండాలను ఎగురవేస్తారు. కమిషనరేట్లలో మాత్రం ఇతర అధికారులకే ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ► హైదరాబాద్‌లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.సుధారాణి, సైబరాబాద్‌లో మహిళా భద్రత విభాగం డీసీపీ సి.అనసూయ ఆదివారం జెండా వందనం చేశారు. రాచకొండలో మాత్రం కమిషనర్ మహేష్ భగవత్ ఎగరేశారు. ఇలానే అప్పుడప్పుడు సైబరాబాద్ కమిషనర్ కూడా జెండాను ఆవిష్కరిస్తుంటారు. హైదరాబాద్ కొత్వాల్ మాత్రం ఎగరేసిన దాఖలాలు లేవు. ► ఆయనకు కీలక బాధ్యతల కారణం హైదరాబాద్ కమిషనర్‌కు జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. గణతంత్ర వేడుకలైనా, స్వాతంత్య్ర దినోత్సవమైనా నగరంలో అధికారిక ఉత్సవాలు జరుగుతాయి. వీటికి జనవరి 26న గవర్నర్, ఆగస్టు 15న సీఎం (ఈ రెండు సందర్భాల్లో ఇద్దరూ హాజరైనా అధికారికంగా గౌరవ వందనం స్వీకరించేది ఒకరే) హాజరవుతారు. వారితో పాటే మంత్రులు, అత్యున్నత అధికారులూ వస్తారు. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. ► ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసు విభాగంలోని ఇతర ఉన్నతాధికారుల కంటే కమిషనర్‌కే ఎక్కువ. ► ఇలాంటి కీలక బాధ్యతలు ఉన్నందువల్లే హైదరాబాద్ కమిషనర్‌కు ఎప్పుడూ తన కార్యాలయంలో జెండా ఎగురవేసే అవకాశం చిక్కదు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం తగదు
సాక్షి, నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం తగదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సచివాలయ పరిపాలన అధికారులను హెచ్చరించారు. జిల్లా నగరపాలక సంస్థ సచివాలయం పరిపాలన అధికారులతో బుధవారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో అన్ని పార్టీలతో అఖీల పక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. నగర అభివృద్దికి అందరి అభిప్రాయాలు కొతామని, ప్లెక్సిల ఏర్పాటు అంశంపై అందరి సలహాలు తీసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అడ్డగోలుగా ఫ్లెక్సీలు ఏర్పాటుపై కూడా నియంత్రణ చేస్తామని, అవసరమైతే పెనాల్టీ వేసే అంశం ఆలోచిస్తామని చెప్పారు. ఆ నిబంధనలు తన ఫ్లెక్సీల విషయంలోనూ వర్తిస్తాయన్నారు. వరదల ప్రమాదం నుంచి నగరాన్ని కాపాడేందుకు అఖిలపక్షం సలహాలు కొరతామని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొడాలి నాని గురించి మాట్లాడే అర్హత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. నాలుగు సార్లు గెలుచిన కొడాలి నాని గురించి రెండు చోట్ల ఓడిన పెద్ద మనిషి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. మీరు ఏ లింగమో ప్రజలెప్పుడో తేల్చారని, రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు చేయను మీరే చెప్పారు కాబట్టి ప్రశ్నిస్తున్నామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తే ప్రభుత్వం ఊరికే కూర్చోదని, చట్టం పని చట్టం చేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. -
అడ్మిన్లూ.. జర జాగ్రత్త..!
సాక్షి, వైరా: సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా వివాదాస్పద పోస్టులు చేస్తామంటే ఇకచెల్లదు. నా గ్రూపుల్లో నేను ఏ సమాచారం షేర్ చేస్తే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించకతప్పదు. అత్యుత్సాహంతో పోస్టులు పెట్టి, అవాకులు చెవాకులు పేలే వారికి శిక్ష తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూపులు అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లోకసభ ఎన్నికల షెడ్యూల్ రావడంతోనే జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్నీ పార్టీలకు చెందిన ఆశావాహులు టికెట్లు వచ్చేలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ట్రెండ్‌లో సోషల్ మీడియా కీలకంగా మారింది. ఆశావాహులు సామాజిక మాధ్యమాల ద్వారానే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల వేళ అభ్యర్థుల హామీలు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై చేసే విమర్శలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల సందడి కనిపిస్తుంది. అభ్యర్థులు, పార్టీలు ఇలాంటి పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ పోస్టులు పెట్టిన గ్రూప్ అడ్మిన్‌పై చట్టప్రకారం కేసులు నమోదవుతాయి. ఎన్నికల వేళ ప్రత్యేకంగా ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సందేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభ్యంతరకర పోస్టులపై ఫిర్యాదులు వస్తే కేసులు పెడతామని అధికారులంటున్నారు. అధికారుల ప్రత్యేక దృష్టి సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు ఎక్కువగా సాగుతుండటంతో అ«ధికారుల సైతం ఈ పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించారు. అశ్లీల సమాచారం. ఫొటో మార్ఫింగ్ తప్పుడు సమాచారం, ఇతరులు మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేసేవారు. జైలు శిక్ష, జరిమానా అనుభవించాల్సి ఉంటుంది. అదే నేరానికి రెండోసారి పాల్పడితే పదేళ్లు జైలు, రూ.2లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలుంటాయి. పోస్టులు పెట్టే అడ్మిన్లతో పాటు వాటిని షేర్ చేసేవారిని కూడా బాధ్యులను చేసే అవకాశం ఉంటుంది. అడ్మిన్లే బాధ్యులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు చట్ట ప్రకారం ఆయా గ్రూపులకు సంబంధించిన అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అపరిచితులను గ్రూప్‌లో చేర్చుకోకపోవడమే ఉత్తమం. వివాదాస్పదపోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారనే విషయాన్ని అడ్మిన్లతోపాటు గ్రూపూలలోని సభ్యులూ తెలుసుకుని మసలుకోవాలి. విద్వేషాలు రెచ్చ గొట్టే విషయాలు, తప్పుడు, తెలియని సమాచారం, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, ఓ వర్గాన్ని బాధించే ఏ విషయాన్ని పోస్టు చేయకపోడమే మంచిది. అడ్మిన్లు జాగ్రత్త వహించాలి ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో ఇబ్బందికర పోస్టులు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇతర వ్యక్తులను, పార్టీలను ఇబ్బందులకు గురిచేసేలా ఎటువంటి పోస్టులు చేయకూడదు. అలా పోస్ట్ చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు కూడా ఉంటాయి. –ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, వైరా -
పాలన.. కొత్త పుంతలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో పాలన కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, శాఖాపరమైన పురోగతి నివేదికలతో పాటు పర్యవేక్షణ కోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. ఇటీవల జిల్లాల సంఖ్యతో పాటే అన్ని శాఖల్లోనూ జిల్లా అధికారుల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో జిల్లాస్థాయి అధికారులతో సమన్వయం, సూచనలు, ఆదేశాల జారీ, పర్యవేక్షణ వంటివి సజావుగా సాగేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాయి. అధికారులకు రోజువారీ కార్యకలాపాలపై అందులోనే సలహాలు, సూచనలిస్తూ క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి. ఇలా నిర్ణయం.. అలా అమలు గతంలో రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయికి చేరాలంటే చాలా సమయం పట్టేది. నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు పోస్టు ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో పంపేవారు. ఆ పరిస్థితికి స్వస్తి పలుకుతూ వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా ఉత్తర్వుల కాపీలను పంపుతున్నారు. అంతేకాకుండా శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాలు, పురోగతి అంశాలను సైతం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో ప్రత్యేకంగా ఒక డిప్యూటీ డైరెక్టర్ వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని నిమిషాల్లో చేరవేస్తున్నారు. ఒక విధంగా గ్రూపు సభ్యులకు సంబంధిత వాట్సాప్ గ్రూపును అనుసరించడం రోజువారీ విధుల్లో భాగమైపోయింది. ఇదే తరహాలో గిరిజన సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖలు సైతం రాష్ట్రస్థాయి వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తున్నాయి. పక్కాగా నిర్వహణ రాష్ట్ర శాఖలు తమ వాట్సాప్ గ్రూపుల నిర్వహణలో జాగ్రత్త వహిస్తున్నాయి. వీటిలో రాష్ట్ర శాఖ కమిషనర్/డైరెక్టర్, ఆ తర్వాత స్థాయిలో ఉండే అదనపు డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లతో పాటు జిల్లా అధికారులు మాత్రమే ఉంటారు. ఒక నిర్ణయాన్ని గ్రూప్‌లో అప్డేట్ చేసిన వెంటనే దాన్ని జిల్లా స్థాయి అధికారులు (గ్రూప్ సభ్యులు) అందరూ చూశారా.. లేదా.. అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా సమాచారాన్ని చూడనట్లు గుర్తిస్తే వెంటనే వారికి ఫోన్ చేసి మరీ విషయాన్ని చేరవేస్తున్నారు. దీంతోపాటు నిర్ణయాలను ఆయా అధికారుల మెయిల్ ఐడీలకు సైతం పంపుతున్నారు. అయితే అధికారులు కార్యాలయంలోనే కాకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉన్నా వాట్సాప్ ద్వారా చూడడం సులభతరం కావడంతో ఉన్నతాధికారులు దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గోప్యమైన అంశాలేమైనా ఉంటే.. వాటిని సదరు అధికారి వ్యక్తిగత వాట్సాప్, ఈ–మెయిల్‌కు పంపుతున్నారు. శాఖాపరమైన వాట్సాప్ గ్రూప్‌ను కార్యాలయ పనివేళల్లో తప్పనిసరిగా అనుసరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేయడం గమనార్హం. సులభం.. కచ్చితం కూడా.. గతంలో పది జిల్లాలున్నప్పుడు సమాచారం ఇవ్వాలంటే ఫోన్ చేసేవాళ్లం. జిల్లాల సంఖ్య పెరగడంతో ఫోన్లో చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ఇందులోనే అన్నీ వివరిస్తున్నాం. జిల్లా స్థాయి అధికారులు దీంతో సకాలంలో స్పందిస్తున్నారు. – వి.సర్వేశ్వర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్