సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో పాలన కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, శాఖాపరమైన పురోగతి నివేదికలతో పాటు పర్యవేక్షణ కోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. ఇటీవల జిల్లాల సంఖ్యతో పాటే అన్ని శాఖల్లోనూ జిల్లా అధికారుల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో జిల్లాస్థాయి అధికారులతో సమన్వయం, సూచనలు, ఆదేశాల జారీ, పర్యవేక్షణ వంటివి సజావుగా సాగేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాయి. అధికారులకు రోజువారీ కార్యకలాపాలపై అందులోనే సలహాలు, సూచనలిస్తూ క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి.
ఇలా నిర్ణయం.. అలా అమలు
గతంలో రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయికి చేరాలంటే చాలా సమయం పట్టేది. నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు పోస్టు ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో పంపేవారు. ఆ పరిస్థితికి స్వస్తి పలుకుతూ వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా ఉత్తర్వుల కాపీలను పంపుతున్నారు. అంతేకాకుండా శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాలు, పురోగతి అంశాలను సైతం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో ప్రత్యేకంగా ఒక డిప్యూటీ డైరెక్టర్ వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు.
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని నిమిషాల్లో చేరవేస్తున్నారు. ఒక విధంగా గ్రూపు సభ్యులకు సంబంధిత వాట్సాప్ గ్రూపును అనుసరించడం రోజువారీ విధుల్లో భాగమైపోయింది. ఇదే తరహాలో గిరిజన సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, మైనార్టీ సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖలు సైతం రాష్ట్రస్థాయి వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తున్నాయి.
పక్కాగా నిర్వహణ
రాష్ట్ర శాఖలు తమ వాట్సాప్ గ్రూపుల నిర్వహణలో జాగ్రత్త వహిస్తున్నాయి. వీటిలో రాష్ట్ర శాఖ కమిషనర్/డైరెక్టర్, ఆ తర్వాత స్థాయిలో ఉండే అదనపు డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్‌లతో పాటు జిల్లా అధికారులు మాత్రమే ఉంటారు. ఒక నిర్ణయాన్ని గ్రూప్‌లో అప్‌డేట్ చేసిన వెంటనే దాన్ని జిల్లా స్థాయి అధికారులు (గ్రూప్ సభ్యులు) అందరూ చూశారా.. లేదా.. అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా సమాచారాన్ని చూడనట్లు గుర్తిస్తే వెంటనే వారికి ఫోన్ చేసి మరీ విషయాన్ని చేరవేస్తున్నారు. దీంతోపాటు నిర్ణయాలను ఆయా అధికారుల మెయిల్ ఐడీలకు సైతం పంపుతున్నారు.
అయితే అధికారులు కార్యాలయంలోనే కాకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉన్నా వాట్సాప్ ద్వారా చూడడం సులభతరం కావడంతో ఉన్నతాధికారులు దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గోప్యమైన అంశాలేమైనా ఉంటే.. వాటిని సదరు అధికారి వ్యక్తిగత వాట్సాప్, ఈ–మెయిల్‌కు పంపుతున్నారు. శాఖాపరమైన వాట్సాప్ గ్రూప్‌ను కార్యాలయ పనివేళల్లో తప్పనిసరిగా అనుసరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేయడం గమనార్హం.
సులభం.. కచ్చితం కూడా..
గతంలో పది జిల్లాలున్నప్పుడు సమాచారం ఇవ్వాలంటే ఫోన్ చేసేవాళ్లం. జిల్లాల సంఖ్య పెరగడంతో ఫోన్‌లో చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ఇందులోనే అన్నీ వివరిస్తున్నాం. జిల్లా స్థాయి అధికారులు దీంతో సకాలంలో స్పందిస్తున్నారు. – వి.సర్వేశ్వర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment