సాహస బాల రుచితకు గీతా చోప్రా అవార్డు
సాయికృష్ణ అఖిల్‌కూ జాతీయ అవార్డు
న్యూఢిల్లీ: 25 మంది చిన్నారులకు కేంద్రం జాతీయ సాహస పురస్కారాలను ప్రకటించింది. ఇందులో 22 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు శివ్వంపేట్ రుచిత. 8 ఏళ్ల ఈ చిన్నారి తెలంగాణలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు చిన్నారుల ఊపిరి నిలబెట్టడంలో ప్రదర్శించిన సాహసానికి ప్రతిష్టాత్మక గీతా చోప్రా అవార్డును దక్కించుకుంది. తెలంగాణకు చెందిన మరో చిన్నారి సాయికృష్ణ అఖిల్ కిలాంబికి కూడా జాతీయ సాహస బాలల పురస్కారం దక్కింది. మొత్తం 25 మందిలో ఇద్దరికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది.
తన నలుగురు మిత్రులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్రకు చెందిన గౌరవ్ సహస్రబుద్దెకు ప్రతిష్టాత్మక సాహస భారత్ అవార్డు దక్కింది. పురస్కారాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24న అందజేస్తారు. అవార్డులు అందుకున్న బాలలు భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారు.