హేతుబద్ధీకరణ తరువాతే..
ఉపాధ్యాయ నియామకాలపై కడియం శ్రీహరి
- టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ, ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు టెట్
- 2017 జూన్ కల్లా స్కూళ్లలో టీచర్లు ఉండేలా చర్యలు
- గురుకులాల్లోనూ 12 వేల వరకు పోస్టులు
- ‘ప్రైవేట్’ కవర్లు తీసుకునే విధానం మానాలి
- డీఈవో, ఆర్జేడీ, ఏడీలకు అవగాహన కార్యక్రమాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో ఇక డీఈవోలు పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు.వెంటనే టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. 2017 జూన్ కల్లా పాఠశాలల్లో టీచర్లు ఉండేలా నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పాఠశాలలు, వాటిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ప్రకారం హేతుబద్ధీకరణకు సంబంధించిన అన్ని ప్రణాళికలను 15 రోజుల్లోగా సిద్ధం చేసి తమకు పంపించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య డీఈవోలకు సూచిం చారు. కొత్త జిలాల్లో నియమితులైన డీఈవోలు, అసిస్టెంట్ డెరైక్టర్లు, ఆర్జేడీలకు 3 రోజుల అవగాహన కార్యక్రమాలను ఆదివారం హైదరాబాద్‌లో కడియం ప్రారంభించి, మాట్లాడారు.
ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం టెట్‌లో అర్హత పొందినవా రినే టీచర్లుగా నియమిస్తామని, గురుకులాల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తామని అన్నారు. వెయిటేజీ పై ఆయా గురుకులాల సొసైటీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో టీచర్ల నియామకాల్లో వెయిటేజీ ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన 250 గురుకులాలు, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్న మరో 119 బీసీ, 90 మైనారిటీ గురుకులాల్లో 12 వేల వరకు పోస్టుల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం కొత్తగా జిల్లాలకు వెళ్లిన డీఈవోలు ఇంకా టీచర్లు అవసరమైన పాఠశాలలను గుర్తించాలన్నారు.
ఎక్కడెక్కడ టీచర్లు అవసరమో డెరైక్టరేట్‌కు రాస్తే 24 గంటల్లో విద్యా వలంటీర్ల నియామకాలకు అనుమతిస్తామన్నారు. తరువాత టీచర్ లేరన్న ఫిర్యాదు వస్తే ఆయా డీఈవోలపై చర్యలు ఉంటాయన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. కోటి చొప్పున ఇచ్చేందుకు 40 మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చారని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లకు నోటీసులు ఇవ్వడం.. వారు కవర్లు ఇవ్వగానే అన్ని బాగున్నాయని సర్టిఫై చేయడం వంటివి మానుకోవాలన్నారు. కేంద్రం పరిశీలనలో ఉన్న ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం కొలిక్కి వచ్చిన వెంటనే రెగ్యులర్ డిప్యూటీ ఈవో, ఎంఈవో, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈవో, మండలానికి ఎంఈవో పోస్టులు ఉంటాయన్నారు. ఇతర జిల్లాలకు వెళ్లిన టీచర్లకు ఆప్షన్ ఇస్తామని, దీనిపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుందన్నారు. వచ్చే ఏడాది మరో 5 వేల ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ప్రారంభిస్తామన్నారు. గురుకులాలు అన్నీ త్వరలోనే విద్యాశాఖ పరిధిలోకి వస్తాయని, వాటికి ప్రత్యేక డెరైక్టరేట్ ఏర్పాటు చేస్తామన్నారు. సర్వ శిక్షా అభియాన్ కార్యాలయాన్ని ప్రత్యేక అకడమిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌గా మార్చాలన్న ఆలోచన ఉన్నట్లు కడియం వివరించారు.