ఖమ్మం, న్యూస్‌లైన్: ఇంటర్ ద్వితీయసంవత్సరం ఫలితాలలో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ విభాగంలో ప్రథమస్థానంతో సహా మొదటి ఐదుస్థానాల్లో ప్రతిభచాటారు. బైపీసీ విభాగంలో ఇద్దరు ప్రథమస్థానం, హెచ్‌ఈసీలో ఒకరు ప్రథమస్థానం సాధించి జిల్లా ఖ్యాతిని నలుదిశల చాటారు. కాగా, ఇంటర్ ఫలితాలలో జిల్లా 64శాతం ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. ఈసారి కూడా బాలికలే హవా కొనసాగించారు. బాలికలు 66శాతం, బాలురు 61శాతం ఉత్తీర్ణత పొందారు. గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 2 శాతం పెరిగింది.
జిల్లా మొత్తం మీద 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 182 ప్రైవేట్ కళాశాలల నుంచి 24,208 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాగా 15,392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 12,426 మందికి 8,237 మంది (66శాతం), బాలురు 11,782 మందికి 7,155 మంది (61శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత పదేళ్లుగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో బాలికలే ముందునిలవడం విశేషం. ఒకేషనల్‌కోర్సులకు సంబంధించి 60శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
గత సంవత్సరం 43శాతం ఉత్తీర్ణత ఉండగా ఇప్పుడు 13శాతం పెరిగింది. ఓకేషనల్‌లో మొత్తం 4,736మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 2850 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో బాలురు 49శాతం మంది ఉత్తీర్ణత సాధించగా... 69శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలు ప్రతిభ చాటారు. వారం రోజుల్లో కళాశాలల ద్వారా విద్యార్థులు మార్కుల జాబితాలను పొందవచ్చునని ఆర్‌ఐవో ఆడ్రోస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల ఫలితాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. గత సంవత్సరం 57.6 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, ఈ సంవత్సరం 63.03 శాతం సాధించాయి. జిల్లాలోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 3,873 మంది చదువుతుండగా 2,441 మంది ఉత్తీర్ణులయ్యారు.
బూర్గంపాడు ప్రభుత్వజూనియర్ కళాశాల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభచాటారు. అదేవిధంగా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల 98.21శాతం, కూనవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల 95.56శాతం, వీఆర్‌పురం ప్రభుత్వ జూనియర్ కళాశాల 95శాతం, బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల 93.15 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 19 ప్రభుత్వ ఓకేషనల్ జూనియర్ కళాశాలల్లో 1098 మందికి 856 మంది (77.96శాతం) ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్‌లో... జిల్లా విద్యార్థుల జయకేతనం
Published Sun, May 4 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement