అవతరణోత్సవాల్లో ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఆర్భాటంగా జరుగుతుండగా ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రం ఆందోళనలతో అట్టుడికింది. ఏడాదిలో ఏం సాధించారని ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నారని ప్రశ్నిస్తూ డీఎస్‌యూ, టీవీఎస్, టీవీవీ, సీఎంఎస్, ఏఎస్‌యూ, టీఎస్‌ఏ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుంచి గన్‌పౌండ్రీ అమర వీరుల స్తూపం వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదని ఎన్‌సీసీ గేటు వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకుని విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, 25 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు నిరసనగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మతో వర్సిటీ లైబ్రరీ నుంచి తార్నాక చౌరస్తా వరకూ శవయాత్ర నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు ఓయూ పోలీస్ స్టేషన్ ఎదుటే సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.