నల్లగొండలో జరిగిన తెలంగాణ సంబరాల్లో ముగ్గు వేస్తున్న యువతి
* తెలంగాణ ఆవిర్భావం.. ఆనందపరవశం
* జూన్ 2న శుభకార్యాలకు ముహూర్తాలు
* జూన్ ఒకటి అర్ధరాత్రి విందులు, వినోదాలు
సాక్షి, హైదరాబాద్: జనవరి 1.. ఆగస్టు 15.. అక్టోబర్ 2.. నవంబర్ 14.. ఈ తేదీలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో తెలంగాణ ప్రజలకు జూన్2 కూడా అంతటి ముఖ్యమైన రోజు కాబోతుంది. వందలాది మంది అమరుల త్యాగం, తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం చేస్తున్న జూన్ 2 చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఈ కీలకమైన రోజు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ రోజున జీవితంలో గుర్తుండిపోయే పని చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆరే ముందున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర మొదటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా తన జీవితంలో కీలకమైన ఘట్టంగా ఆవిర్భావ దినోత్సవాన్ని మలచుకుంటున్నారు. ఆయనతో పాటు ప్రమాణం చేసే మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జూన్ 2 గుర్తుండిపోయే రోజే.
తెలంగాణ అంతటా ఆసక్తి...
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలు ఏదో ఒక ప్రత్యేక గుర్తింపు కార్యం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు అదేరోజు తమ వివాహ ముహూర్తాలు పెట్టుకుం టున్నారు. జూన్‌లోనే పాఠశాలలు ప్రారంభం కానుండడంతో ఈ విద్యాసంవత్సరంలో బడులకు పంపాలనుకునే తల్లిదండ్రులు 2వ తేదీన అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించుకున్నారు. మరికొందరు గృహప్రవేశాలకు ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇంకొందరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా తమ జీవితాన్ని మలచుకోవాలని చూస్తున్నారు.
సంబురాలకు సిద్ధం..: జూన్1 నుంచే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులైతే ఉద్యమవీరులను స్మరించుకునేందుకు ఏర్పాట్లుచేశారు.
హైదరాబాద్‌లో జూన్ ఒకటి అర్థరాత్రి గన్‌పార్కు వద్ద ఉద్యమవీరులకు నివాళి అర్పించాలని నిర్ణయించారు. తెలంగాణ అంతటా అర్థరాత్రి 12 గంటల సమయంలో బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీలు తీయనున్నారు. రక్తదాన శిబిరాలు, మరణానంతరం అవయవదానాలు చేసేందుకు వీలుగా పత్రాలు సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గర్భిణీలు ఈ ప్రత్యేకమైన రోజున తమ బిడ్డకు జన్మనిచ్చేందుకు వీలుగా వైద్యులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణకు చెందిన పలువురు వివిధ రాష్ట్రాల్లో, సీమాంధ్రలో ఉన్న వారు ఆవిర్భావ దినోత్సవం రోజు స్థానికంగా ఉండేట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే నూతన సంవత్సర వేడుకల్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే యువకులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జనవరి ఫస్ట్ నాటి వేడుకల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
శుభకార్యాలకు దివ్యమైన రోజు..
జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అది జేష్ఠ శుద్ధ పంచమి సోమవారం. ఈ జేష్ఠ మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి. పైగా జూన్ 2 సోమవారం నాడు పంచమి పూర్తి రోజు ఉంటుంది. అది అన్ని ముహూర్తాలకు అత్యంత దివ్యమైన రోజుగా చెప్పుకోవచ్చు. నా వద్దకు భక్తుల్లో చాలామంది జూన్ రెండున ఏదో ఒక శుభకార్యం చేయించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను పూర్తిస్థాయిలో ఆచరించేందుకు ఆరోజు నుంచి శ్రీకారం చుట్టాలని పలువురు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిళ్లు, గహప్రవేశాలు, అక్షరాభ్యాసం, స్థిరాస్తుల కొనుగోలు వంటివి చేయడం ద్వారా జూన్ రెండును తమ జీవితంలోనూ కీలక ఘట్టంగా మార్చుకోవాలని పలువురు యోచిస్తున్నారు.
- ద్రోణ వెంకటరమణ శర్మ, పురోహితులు
సంబరాలు చేసుకోవాలని టీఆర్‌ఎస్ సందేశం
జూన్ 2న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తెలంగాణలోని అన్ని గ్రామాల్లో సంబురాలను నిర్వహించుకోవాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు పార్టీ అధినాయకత్వం సందేశాన్ని పంపింది. ప్రమాణస్వీకారం పూర్తికాగానే టపాకాయలను కాల్చాలని, పెద్ద ఎత్తున సంబురాలను నిర్వహించుకోవాలని సూచించింది.
ర్యాలీలు.. జెండావిష్కరణలు
తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ రెండున పెద్ద ఎత్తున ర్యాలీలు, తెలంగాణ జెండావిష్కరణలు చేయాలని నిర్ణయించాం. ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తాం. సాంసృ్కతిక కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులు కృషి చేయాలని, పని సంస్కృతిని అలవర్చుకోవాలని విన్నవించాం. జూన్ రెండు నుంచి తెలంగాణలో ఉద్యోగుల బాధ్యత మరింత పెరగనుంది.
- దేవీప్రసాద్, టీఎన్జీవోల అధ్యక్షుడు