సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ కోసం వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతులకు రూ.లక్ష వరకున్న రుణాల మాఫీ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తుండటంతో వ్యవసాయాధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ)కి చెందిన బ్యాంకర్లతో వ్యవసాయ శాఖ అధికారులు శనివారం సమావేశమయ్యారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో రుణమాఫీ కసరత్తు వివరాలను బయటకు వెల్లడించట్లేదని చెబుతున్నారు. గతంలో రూ.లక్ష రుణమాఫీ నాలుగు విడతల ప్రక్రియ 2017 మార్చితో ముగిసింది.
ఆ తర్వాతి నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్లలో ఎంతమంది రైతులు ఎంత రుణం తీసుకున్నారన్న విషయాలను అధికారులు సేకరించారు. అలాగే లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులెంత మందో సేకరించారు. మొత్తం రుణం తీసుకున్న రైతుల్లో వీరి శాతమెంత అనే వివరాలనూ గుర్తించారు. దాదాపు 90 శాతం పైగానే లక్ష రూపాయలు తీసుకున్న రైతులున్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. గతంలో లక్ష రూపాయల రుణమాఫీ సందర్భంగా తలెత్తిన పలు సమస్యలను ఈసారి జరగకుండా చూసుకోవాలని సర్కారుకు బ్యాంకర్లు సూచించినట్లు తెలిసింది.
40 నుంచి 45 లక్షల మంది రైతులు..
ఈ సమావేశానికి హాజరైన ఒక అధికారి అంచనా ప్రకారం ఈసారి రుణమాఫీ 40 లక్షల నుంచి 45 లక్షల మంది రైతులకు చేయాల్సి వస్తుందని తెలిపారు. నాలుగు సీజన్లలో తీసుకున్న పంట రుణాలన్నింటినీ కలిపితే ఒక్కో రైతు సరాసరి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు రుణం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. 2014లో ప్రభుత్వం 35.29 లక్షల మందికి లక్ష రూపాయలు మాఫీ చేయగా, ఈసారి అదనంగా 10 లక్షల మంది చేరే అవకాశముంది. అప్పుడు రూ.16,124 కోట్లు రుణమాఫీ చేయగా, ఈసారి రూ.20 వేల కోట్ల వరకు చేయాల్సి రావొచ్చని భావిస్తున్నారు. 2014లో ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేసినప్పుడు, వాటిని నాలుగు వాయిదాల్లో చెల్లించిన సంగతి తెలిసిందే. అంటే 2017 మార్చి నాటికి వాయిదాలన్నీ చెల్లించారు.
ఇప్పుడు ఆ తర్వాత నుంచి రుణాలు తీసుకున్న రైతులనే పరిగణనలోకి తీసుకుంటే 2017–18 ఖరీఫ్, రబీల్లో 39.11 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. అందులో ఖరీఫ్‌లో 26.20 లక్షల మంది, రబీలో 12.90 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఆ ఏడాది రూ.31,410 కోట్ల రుణాలను బ్యాంకులు రైతులకు ఇచ్చాయి. 2018–19లో ఇప్పటివరకు 26.45 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వారికి బ్యాంకులు మొత్తం రూ.23,488 కోట్ల రుణాలు ఇచ్చాయి. అందులో ఈ ఖరీఫ్‌లో 22.21 లక్షల మంది రైతులు రూ.19,671 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత రబీలో ఇప్పటివరకు 4.24 లక్షల మంది రైతులు రూ. 3,816 కోట్ల రుణా లు తీసుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో జిల్లాల నుంచి బ్యాంకుల వారీగా లెక్కలు తీసుకున్నాకే స్పష్టత వస్తుందని బ్యాంకర్లు అన్నట్లు సమాచారం.
మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ మేధోమథనం..
ప్రభుత్వం ఈసారి కూడా రుణమాఫీకి హామీ ఇవ్వడంతో మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. సీఎం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేధోమథనం చేస్తున్నట్లు తెలిసింది. అయితే 2014లోనూ రూ.లక్ష రుణమాఫీ చేశారు. ఇప్పుడూ రూ.లక్ష వరకే హామీ ఇచ్చారు. అయితే ఒకేసారి రుణమాఫీ ఉంటుందని సర్కారు చెప్పడంతో అమలు మార్గదర్శకాల తయారుపై తర్జనభర్జన మొదలైంది. ఒకేసారి రూ.20 వేల కోట్లు ఇవ్వాలంటే సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది. వచ్చే బడ్జెట్లో దీనికే రూ.20 వేల కోట్లు కేటాయిస్తే, రైతుబంధుకు మరో రూ.15 వేల కోట్లు కేటాయించాల్సి వస్తుంది. అంటే రుణమాఫీ, రైతుబంధుకే రూ.35 వేల కోట్లు కేటాయించాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ వర్గాలు పలువురు నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment