అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం
హసన్‌పర్తి: వరంగల్ నగర శివారు పైడిపల్లిలోని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటాపు రం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఇంచర్ల రాజు (17) అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలోని హాస్టల్‌లో ఉంటున్నాడు. రాజు బుధవారం తోటి విద్యార్థులతో కలసి హోలీ సంబరాల్లో పాల్గొన్నాడు. గురువారం తెల్లవారుజామున పురుగులమందు తాగాడు. ఆ వెంటనే రాజు గది నుంచి బయటకు వచ్చి తాను పురుగు మందు తాగానని, ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడ ఉన్న సెక్యూరిటీగార్డులను ప్రాధేయపడ్డాడు. వారు వెంటనే రాజును ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాజు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రాజు ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజు తల్లి కొంతకాలం క్రితం మృతి చెందగా అతని తండ్రి సూరయ్య మరో వివాహం చేసుకున్నాడు. రాజు సోదరికి వివాహం కాగా ఆమె అత్తింటి వారికి కట్నం డబ్బులు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఈ ఇబ్బందులతోనే రాజు ఆత్మహత్య చేసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం: రాజు తండ్రి
కళాశాల అధికారుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి సూరయ్య ఆరోపించారు. కళాశాల హాస్టల్‌లో పురుగు మందు డబ్బా లు ఎందుకు పెట్టారని ప్రశ్నించాడు. ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, తన కుమారుడి ఆత్మహత్యపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.