హైదరాబాద్ : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ జరక్కుండా చర్యలు తీసుకోవాలని వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్లూరి పద్మరాజు ఆయా కళాశాలల అధిపతులను ఆదేశించారు. ఏపీలోని వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్, టెక్నాలజీ, గృహ విజ్ఞాన, పాలిటెక్నిక్ కళాశాలల అధిపతులు, అసోసియేట్ డీన్లు, వార్డెన్ల సమావేశం గురువారం నగరంలో జరిగింది. విద్యార్ధి వ్యవహారాల విభాగం డీన్ డాక్టర్ ఆర్.వి.రాఘవయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. కళాశాలల్లో చేరిన కొత్త విద్యార్థులను పాతవారు సరదాగానైనా ఆట పట్టించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించమని సూచించారు. క్లాసుల్లో, హాస్టళ్లలో హాజరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పై అధికారులకు తెలియజేయాలన్నారు. హాస్టళ్లలో వసతులు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు. పీజీ విద్యార్ధుల పరిశోధనకు సంబంధించిన డేటాను పర్యవేక్షించాలని సంబంధిత డీన్లను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఏర్పాటు చేయనున్న ప్రత్యేక శిక్షణ విభాగం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కళాశాలలకు నాబార్డ్ ఇచ్చే నిధుల వినియోగానికి పక్కా ప్రణాళికలు తయారు చేయాల్సిందిగా ఆదేశించారు.
'అగ్రికల్చర్ కాలేజీల్లో ర్యాగింగ్ జరగకూడదు'
Published Thu, Oct 29 2015 8:01 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement