అమ్మో.. దొంగలు
జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో జనం బెంబేలెత్తుతున్నారు. పది రో జుల వ్యవధిలోనే రెండుసార్లు దుండగులు ఒకే తరహాలో తెగబడ్డారు. రెండు నెలల క్రితం జిల్లాలో వరుసగా జరిగిన ‘మెరుగు’ దొంగల కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు.
తాజాగా దోపిడీ దొంగలు రెచ్చిపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 12న అర్ధరాత్రి శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో దేవయ్య గౌడ్ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు కత్తులతో బెదిరించి ఆయన భార్యాకుమార్తెల నుంచి 30 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న రూ. 50 వేల నగదును దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నెల 1న అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు శంకర్‌పల్లి మండలంలోని పత్తేపూర్ గ్రామంలో గొల్ల రాములు ఇంటి తలుపులను రాళ్లతో బద్దలుకొట్టి లోపలికి చొరబడ్డారు. కుటుంబీకులపై కత్తులతో దాడి చేసి కళ్లలో కారంపొడి చల్లి 11 తులాల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి ముగ్గురి తీవ్రంగా గాయపరిచారు. పెద్దగోల్కొండలో దొంగలు కత్తులతో బెదిరించి అందిన కాడికి దోచుకుపోయారు.
రాయలసీమ ముఠా పనేనా..?
రెండు చోట్ల దోపిడీకి పాల్పడింది రాయలసీమ ముఠానేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస దోపిడీలతో పోలీసులు ఈ కేసులను సవాలుగా తీసుకుని విచారణ చేస్తున్నారు. పాత నేరస్తుల నుంచి దోపిడీకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ దొంగలు మాట్లాడిన భాష, దోపిడీ తీరును నిశితంగా విచారణ చేస్తున్నారు. పెద్దగోల్కొండలో దొంగలు దోపిడీ తర్వాత అర కిలో మీటరు దూరం వరకు తూర్పు దిక్కుగా వెళ్లినట్లు డాగ్ స్క్వాడ్ ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా దొంగలు తెలుగు, హిందీతో పాటు వారి కోడ్ భాషలో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. రెండు చోట్ల కూడా దుండగులు దోపిడీకి ముందుగా తాము ఎంచుకున్న ఇళ్లకు పొరుగున్న ఉన్న ఇళ్ల తలుపులకు గ డియపెట్టడం గమనార్హం.
మరుగున పడిన ‘మెరుగు’ కేసులు..
బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామంటూ జనాన్ని నమ్మించి దొంగలు గతంలో జిల్లాలో చోరీలకు తెగబడ్డారు. జనవరి నెలలో పది రోజుల వ్యవధిలో మూడు చోట్ల ఇదే తరహాలో దొంగతనాలు జరిగాయి. జనవరి 21న మొయినాబాద్ మండలంలోని సురంగల్‌లో, 28న శంషాబాద్ మండలం శంకరాపురంలో, 29న శామీర్‌పేట్ మండలం బొమ్మరాశిపేటలో దుండగులు 18 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇత్తడి, వెండి, బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ బైక్‌లపై గ్రామాల్లో తిరుగుతూ అమాయక మహిళల వద్ద చోరీలు చేశారు. ’మెరుగు’ చోరీలు జరిగి రెండు నెలలు గడుస్తున్నా కేసుల్లో పురోగతి లేదని తెలుస్తోంది. పెద్దగోల్కొండ ఘటనపై శంషాబాద్ సీఐ వేణుగోపాల్‌ను వివరణ కోరగా కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను రంగంలోకి దించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.