Dacoits The
-
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
మారణాయుధాలతో బెదిరింపు ఐదు తులాల బంగారం అపహరణ గుంతకల్లు, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపాన గురువారం అర్ధరాత్రి పద్మావతి ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ స్పెషల్) రైలులో దోపిడీదొంగలు బీభత్సం సృష్టిం చారు. ప్రయాణికులపైకి రాళ్లు రువ్వి.. మారణాయుధాలతో భయభ్రాంతులకు గురిచేసి ఐదుతులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రైలు నం- 12731) గురువారం రాత్రి 9గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరింది. గుత్తి రైల్వేస్టేషన్‌కు రాగానే దొంగల ముఠా సభ్యులు కొందరు రైలులో ఎక్కారు. మరికొందరు పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపాన కాపు కాశారు. ఎస్6, ఎస్7, ఎస్8, ఎస్9, ఎస్10 బోగీల్లో ప్రయాణిస్తున్న దుండుగులు కొందరు అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి రైలు పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ చేరుకోగానే పథకం ప్రకారం చైనులాగి రైలును ఆపారు. బయట ఉన్న దుండగులు లోపలికి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. తలుపులన్నీ వేసి ఉండటంతో లోనికి రావడానికి వీలుకాక రాళ్లు రువ్వి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. రైలులో ప్రయాణిస్తున్న దుండగులు వెంట తెచ్చుకున్న కత్తులు, పిడిబాకులు చూపి ప్రయాణికులను బెదిరించారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన భవాని మెడలోని 5 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని రైలుదిగి పారిపోయారు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ రైలు బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ కావడం వల్ల అందులో ఎస్కార్టు పోలీసులు లేరని తెలిసింది. విషయం తెలుసుకున్న గుంతకల్లు జీఆర్పీ సిబ్బంది పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఏప్రిల్ 4వతేదీ రాత్రి కూడా అనంతపురం-పెనుగొండ మధ్య దుండుగులు ఇదేతరహాలో హంపి ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీకి విఫలయత్నం చేశారు. రైళ్లలో దోపిడీలపై చంద్రబాబు ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రైళ్లలో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలపై టీడీపీ అధ్యక్షుడు, సీమాంధ్రకు కాబోయే సీఎం నారా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ఘటనలను అరికట్టడంలో అధికారు లు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందోబస్తు వైఫల్యం వల్లే ఇలా జరుగుతోందన్నారు. వారం రోజుల్లో చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మూడుసార్లు దోపిడీ జరగడం రైల్వే పోలీస్ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైల్వేశాఖ ప్రయాణికుల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. -
అమ్మో.. దొంగలు
జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో జనం బెంబేలెత్తుతున్నారు. పది రో జుల వ్యవధిలోనే రెండుసార్లు దుండగులు ఒకే తరహాలో తెగబడ్డారు. రెండు నెలల క్రితం జిల్లాలో వరుసగా జరిగిన ‘మెరుగు’ దొంగల కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. తాజాగా దోపిడీ దొంగలు రెచ్చిపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 12న అర్ధరాత్రి శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో దేవయ్య గౌడ్ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు కత్తులతో బెదిరించి ఆయన భార్యాకుమార్తెల నుంచి 30 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న రూ. 50 వేల నగదును దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నెల 1న అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు శంకర్పల్లి మండలంలోని పత్తేపూర్ గ్రామంలో గొల్ల రాములు ఇంటి తలుపులను రాళ్లతో బద్దలుకొట్టి లోపలికి చొరబడ్డారు. కుటుంబీకులపై కత్తులతో దాడి చేసి కళ్లలో కారంపొడి చల్లి 11 తులాల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి ముగ్గురి తీవ్రంగా గాయపరిచారు. పెద్దగోల్కొండలో దొంగలు కత్తులతో బెదిరించి అందిన కాడికి దోచుకుపోయారు. రాయలసీమ ముఠా పనేనా..? రెండు చోట్ల దోపిడీకి పాల్పడింది రాయలసీమ ముఠానేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస దోపిడీలతో పోలీసులు ఈ కేసులను సవాలుగా తీసుకుని విచారణ చేస్తున్నారు. పాత నేరస్తుల నుంచి దోపిడీకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ దొంగలు మాట్లాడిన భాష, దోపిడీ తీరును నిశితంగా విచారణ చేస్తున్నారు. పెద్దగోల్కొండలో దొంగలు దోపిడీ తర్వాత అర కిలో మీటరు దూరం వరకు తూర్పు దిక్కుగా వెళ్లినట్లు డాగ్ స్క్వాడ్ ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా దొంగలు తెలుగు, హిందీతో పాటు వారి కోడ్ భాషలో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. రెండు చోట్ల కూడా దుండగులు దోపిడీకి ముందుగా తాము ఎంచుకున్న ఇళ్లకు పొరుగున్న ఉన్న ఇళ్ల తలుపులకు గ డియపెట్టడం గమనార్హం. మరుగున పడిన ‘మెరుగు’ కేసులు.. బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామంటూ జనాన్ని నమ్మించి దొంగలు గతంలో జిల్లాలో చోరీలకు తెగబడ్డారు. జనవరి నెలలో పది రోజుల వ్యవధిలో మూడు చోట్ల ఇదే తరహాలో దొంగతనాలు జరిగాయి. జనవరి 21న మొయినాబాద్ మండలంలోని సురంగల్‌లో, 28న శంషాబాద్ మండలం శంకరాపురంలో, 29న శామీర్‌పేట్ మండలం బొమ్మరాశిపేటలో దుండగులు 18 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇత్తడి, వెండి, బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ బైక్‌లపై గ్రామాల్లో తిరుగుతూ అమాయక మహిళల వద్ద చోరీలు చేశారు. ’మెరుగు’ చోరీలు జరిగి రెండు నెలలు గడుస్తున్నా కేసుల్లో పురోగతి లేదని తెలుస్తోంది. పెద్దగోల్కొండ ఘటనపై శంషాబాద్ సీఐ వేణుగోపాల్‌ను వివరణ కోరగా కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను రంగంలోకి దించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.