మారణాయుధాలతో బెదిరింపు ఐదు తులాల బంగారం అపహరణ
గుంతకల్లు, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపాన గురువారం అర్ధరాత్రి పద్మావతి ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ స్పెషల్) రైలులో దోపిడీదొంగలు బీభత్సం సృష్టిం చారు. ప్రయాణికులపైకి రాళ్లు రువ్వి.. మారణాయుధాలతో భయభ్రాంతులకు గురిచేసి ఐదుతులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ (రైలు నం- 12731) గురువారం రాత్రి 9గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరింది. గుత్తి రైల్వేస్టేషన్‌కు రాగానే దొంగల ముఠా సభ్యులు కొందరు రైలులో ఎక్కారు.
మరికొందరు పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ సమీపాన కాపు కాశారు. ఎస్6, ఎస్7, ఎస్8, ఎస్9, ఎస్10 బోగీల్లో ప్రయాణిస్తున్న దుండుగులు కొందరు అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి రైలు పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ చేరుకోగానే పథకం ప్రకారం చైనులాగి రైలును ఆపారు. బయట ఉన్న దుండగులు లోపలికి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. తలుపులన్నీ వేసి ఉండటంతో లోనికి రావడానికి వీలుకాక రాళ్లు రువ్వి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు.
రైలులో ప్రయాణిస్తున్న దుండగులు వెంట తెచ్చుకున్న కత్తులు, పిడిబాకులు చూపి ప్రయాణికులను బెదిరించారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన భవాని మెడలోని 5 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని రైలుదిగి పారిపోయారు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ రైలు బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ కావడం వల్ల అందులో ఎస్కార్టు పోలీసులు లేరని తెలిసింది. విషయం తెలుసుకున్న గుంతకల్లు జీఆర్‌పీ సిబ్బంది పాతకొత్తచెరువు రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఏప్రిల్ 4వతేదీ రాత్రి కూడా అనంతపురం-పెనుగొండ మధ్య దుండుగులు ఇదేతరహాలో హంపి ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీకి విఫలయత్నం చేశారు.
రైళ్లలో దోపిడీలపై చంద్రబాబు ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రైళ్లలో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలపై టీడీపీ అధ్యక్షుడు, సీమాంధ్రకు కాబోయే సీఎం నారా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ఘటనలను అరికట్టడంలో అధికారు లు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బందోబస్తు వైఫల్యం వల్లే ఇలా జరుగుతోందన్నారు. వారం రోజుల్లో చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మూడుసార్లు దోపిడీ జరగడం రైల్వే పోలీస్ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైల్వేశాఖ ప్రయాణికుల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు.
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
Published Sat, May 31 2014 12:59 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement