నిర్మాణ కంపెనీలతో సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సమీక్ష
గోదావరిఖని: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను 2016 జనవరి నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. గురువారం ఆయన సింగరేణి అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులపై హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జైపూర్ ప్లాంట్ ప్రధాన నిర్మాణ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్ చేపడుతున్న పనులను అంశాల వారీగా సమీక్షించారు. యూనిట్-1లో బాయిలర్ లైటప్ జూన్‌లో, యూనిట్-2లో జూలైలో జరుగనున్న స్విచ్ యార్డు పనులు మరింత వేగవంతం చేయాలని, రెండో యూనిట్‌లో మందకొడిగా సాగుతున్న సివిల్ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.
బ్యాలన్స్ ఆఫ్ ప్లాంట్ పనుల నిర్మాణ ఏజెన్సీ ‘మెక్‌నెల్లి భారత్’తో చిమ్నీ పనుల గురించి చర్చించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న సివిల్ పనుల్లో వంద క్వార్టర్ల నిర్మాణం, శ్రీరాంపూర్ నుంచి పవర్ ప్లాంటు వరకు రోడ్డు వెడల్పు పనులు, శ్రీరాంపూర్ ఓసీ నుంచి పవర్ ప్లాంటు వరకు జరగాల్సిన రైల్వే లైన్ పనులపై ఆయన సమీక్షించారు. వీటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్నది వర్షాకాలం కనుక.. సివిల్ పనులను రాత్రి వేళల్లోనూ కొనసాగించాలన్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని, లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
జనవరి నాటికి జైపూర్ ప్లాంట్‌ను సిద్ధం చేయాలి
Published Fri, May 29 2015 2:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement