ఎయిర్ అంబులెన్స్ పనితీరును పరిశీలిస్తున్న దృశ్యం
హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా ‘ఎయిర్ అంబులెన్స్’సేవలు నగరంలో ప్రారంభమయ్యాయి. ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (హెచ్‌ఈఎంఎస్)ను శనివారం వింగ్స్ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వై.ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదం, ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు తీవ్ర గాయాలైన వారికి సత్వరమే వైద్య సేవలందిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ఇలాంటి వారి కోసమే ఎయిర్ ఎయిడ్ పేరిట సేవలను ప్రారంభించామన్నారు.
ఎయిర్ ఎయిడ్ ద్వారా సేవలందించేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్ 109సీ హెలికాప్టర్‌ను తెప్పించినట్లు చెప్పారు. నలుగురు ప్రయాణించే ఈ హెలికాప్టర్‌లో వైద్య సేవలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. డీజీసీఏ సర్టిఫికెట్ ఉండటంతో అనుకూల ప్రాంతం ఎక్కడున్నా ల్యాండింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 50 మీటర్ల స్థలం ఉంటేచాలు ఈ హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయొచ్చని, దీనిలో ఒకసారి ఇంధనం నింపితే 450 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపారు.
రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లోనూ ఎయిర్ ఎయిడ్ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ హెలికాప్టర్ సేవల కోసం 18007582080 నంబర్‌కు గాని, www. airaidcare.com వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించవచ్చని ప్రభాకర్‌రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment